కలం, వెబ్‌డెస్క్: ఇటీవలి కాలంలో స్టాండప్ కమెడియన్లు (Stand up comedians) వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నీమధ్యే జనసేన అధినేత. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై ఓ స్టాండప్ కమెడియన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. జనసేన కార్యకర్తలు అతడికి వార్నింగ్ కూడా ఇచ్చారు. చివరికి అతడు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. తాజాగా మరో పార్టీ మద్దతుదారులు ఓ స్టాండప్ కమెడియన్‌కు వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. శరత్ ఉదయ్ (Sharath Uday) అనే స్టాండప్ కమెడియన్ బెంగళూర్‌లోని కోరమంగళ ప్రాంతంలో షో చేస్తుండగా ఏపీకి చెందిన పలువురు టీడీపీ మద్దతుదారులు అతడి షోను అడ్డుకున్నారు. రెండేళ్ల క్రితం శరత్ తన స్టాండప్ కామెడీలో చంద్రబాబు (Chandrababu)పై జోకులు వేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే శరత్ గతంలోనే ఆ ఘటనకు క్షమాపణలు చెప్పాడు.
ఇక తాజాగా టీడీపీ మద్దతుదారులు మళ్లీ క్షమాపణ చెప్పాలని శరత్‌ను వేదికపైనే, అందరి ముందు బెదిరించారు. ఇక చేసేదేం లేక అతడు మరోసారి క్షమాపణలు చెప్పాడు. అంతటితో ఆగకుండా వాళ్లు ఆ స్టాండప్ కమెడియన్ తో చంద్రబాబుకు జై కొట్టించారు. సారీ చెప్పిన వీడియోను రికార్డు చేసుకున్నారు. సారీ చెప్పిన తర్వాత కూడా బూతులతో రెచ్చిపోయారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇది కాస్తా వైరల్‌గా మారింది. రెండేళ్ల క్రితం జరిగిన ఘటనకు అప్పుడే క్షమాపణలు చెప్పినా.. ఇప్పుడు మళ్లీ ఇలా బెదిరింపులకు గురి చేయడం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు.

