కలం, వెబ్ డెస్క్: తెలంగాణ సచివాలయంలో సినిమాలకు మించి సస్పెన్స్ థ్రిల్లర్ సన్నివేశాలు కొనసాగుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు. సినిమాటోగ్రఫీశాఖా మంత్రికి తెలియకుండానే టికెట్ ధరల పెంపునకు సంబంధించి జీవోలు రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగశక్తులు రాజ్యమేలుతున్నాయంటూ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ఉంటే ఎవరి నియంత్రణలో ఉందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని ఆరోపించారు.
ధరల పెంపు సంబంధిత మంత్రికే సంబంధం లేదా?
ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) వెలువడుతుండగా, మరోవైపు సినిమాటోగ్రఫీశాఖకు బాధ్యత వహిస్తున్న మంత్రి తనకు ఈ నిర్ణయాలతో సంబంధం లేదని, ఫైల్ తన వద్దకు రాలేదని చెప్పడం పాలనా వైఫల్యానికి నిదర్శనమని హరీశ్ రావు విమర్శించారు. శాఖ ఒకరిది, నిర్ణయాధికారం మరొకరిది, జీవోలు ఇచ్చేది ఇంకొకరి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఎవరిచేతిలో ఉంది?
సంబంధితశాఖ మంత్రికి తెలియకుండానే కీలక నిర్ణయాలు జరిగితే ప్రభుత్వం ఎవరి చేతుల్లో నడుస్తోందనే ప్రశ్న తలెత్తుతుందని హరీశ్‌రావు ప్రశ్నించారు. సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వ తీరు మారలేదని హరీశ్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో సినిమా టికెట్ రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అలాంటి ప్రకటనల అనంతరం రాత్రికి రాత్రే జీవోలు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు. ఇప్పటికే మూడు సినిమాలకు టికెట్ ధరలు పెంచుతూ జీవోలు జారీ అయ్యాయని, మరో సినిమాకు కూడా అదే తరహా అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని హరీశ్ ఆరోపించారు.
నచ్చినవారికి రేట్లు పెంచుతారా?
తమకు నచ్చిన వారికి రూ.600 వరకు టికెట్ రేట్లకు అనుమతి ఇస్తారా? వారం రోజులు రేట్లు పెంచుకునేలా రెడ్ కార్పెట్ వేస్తారా? అంటూ హరీశ్ విమర్శలు గుప్పించారు. పాలకుడు పాలసీతో ఉండాలే తప్ప పగతో ఉండకూడదని వ్యాఖ్యానించారు. గత పదేళ్ల పాటు కేసీఆర్ (KCR) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినిమా పరిశ్రమను సమానంగా చూసామని, ఎలాంటి వివక్ష చూపలేదని బీఆర్‌ఎస్ గుర్తుచేసింది. అందుకే తెలుగు సినిమా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. సినిమా టికెట్ రేట్ల పెంపులో కమీషన్ల దందా జరుగుతోందని, శాఖ మంత్రికి తెలియకుండా ఈ వ్యవహారం సాగుతోందని ఆరోపిస్తూ, దీనిపై గవర్నర్ సమగ్ర విచారణ జరపాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Read Also: గంటకు 3 వేల వాహనాలు.. పంతంగి మీదుగా సంక్రాంతి రష్..
Follow Us On: X(Twitter)


