కలం వెబ్ డెస్క్ : వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadasi) రోజు వేంకటేశ్వరస్వామిని నకిలీ ఆభరణాలతో (Fake Ornaments) అలంకరించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నంద్యాల(Nandyal) జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులో మంగళవారం జరిగిన ఈ వ్యవహారంలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి వేడుకలు ముగిసిన తర్వాత ఆభరణాలు భద్రపరిచే సమయంలో అర్చకుడు నకిలీ ఆభరణాలను గుర్తించాడు. అపహరణకు గురైన ఆభరణాల్లో వెండి కిరీటం, హస్తాలు, చక్రం, శంఖం, పాదాల తొడుగులతో పాటు మరికొన్ని ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఆలయ ఈవో జయచంద్రారెడ్డి ఆలయాన్ని పరిశీలించారు. గత ఈవో తనకు చార్జ్ ఇవ్వలేదని ఆయన వెల్లడించారు.
దీనిపై అన్ని కోణాల్లో విచారణ చేపడతామని తెలిపారు. ఈ అంశంలో రిటైర్డ్ ఈవో నర్సయ్య, అర్చకుడు కిషోర్ శర్మ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు. గతంలో పని చేసిన ఈవో తనకు పూర్తి బాధ్యతలు అప్పగించలేదని, దీనిపై తాను ఇప్పుడే మాట్లాడలేనని చెప్తున్న జయచంద్రారెడ్డి పైనా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాతలు సమర్పించిన వెండి ఆభరణాల స్థానంలో నకిలీవి (Fake Ornaments) ప్రత్యక్షమవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణ వేగవంతం చేసి, నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: సింహాచలం ప్రసాదం కేసులో సీన్ రివర్స్.. బాధితులపై పోలీసుల విచారణ
Follow Us On: Youtube


