కలం, వెబ్ డెస్క్: స్నేహం (Friendship).. ఒక అద్భుతమైన బంధం. ఎవరికీ చెప్పుకోలేని, చెప్పుకోని విషయాలను కూడా షేర్ చేసుకునే బంధం. స్నేహానికి కాలపరిమితి లేదు.. ఇది చాలా మంది చెప్తారు. కానీ నిపుణులు మాత్రం స్నేహానికి కూడా ఎక్స్‌పైరీ ఉంటుందని అంటున్నారు. ఏ స్నేహమైనా మొదట్లో ఎంతో మధురంగా, అద్భుతంగా అనిపిస్తుంది. కానీ కాలక్రమేణా కొన్ని బంధాలు ముగింపు దశకు చేరుకుంటాయి. చాలామంది దీన్ని గుర్తించలేరు లేదా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అయితే, ఒక స్నేహం దాని గడువు ముగిసిందని చెప్పడానికి ఐదు ముఖ్యమైన గుర్తులు ఉన్నాయని పాజిటివ్ సైకాలజీ నిపుణురాలు రోజ్ కోల్తార్ట్ వివరిస్తున్నారు.
కలవాలంటే భయం:
స్నేహితులను కలవడానికి వెళ్లే ముందు మీ మనసులో ఏదో తెలియని అసౌకర్యం లేదా భయం లాంటి భావన కలుగుతుంటే, అది ఆ బంధం ముగిసిపోవడానికి మొదటి సంకేతం.
శుభవార్త చెప్పకపోవడం:
గతంలో ఏదైనా మంచి విషయం జరిగితే వెంటనే పంచుకునే ఆ స్నేహితుడికి, ఇప్పుడు అందరికంటే చివర్లో చెబుతున్నారంటే.. మీ ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అర్థం.
నిజాయితీ తగ్గడం:
స్నేహితుల దగ్గర మనం మనలా ఉండలేకపోవడం, మనసులో మాట చెప్పే ముందు వారు ఏమనుకుంటారో అని ఆలోచించి మాటలను మార్చుకుంటున్నారంటే ఆ బంధం బలహీనపడినట్లే.
ప్లాన్స్ రద్దయితే సంతోషం:
స్నేహితుడిని కలవాల్సిన ప్లాన్ ఏదైనా కారణం వల్ల రద్దయినప్పుడు మీరు బాధపడకుండా, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటే ఆ స్నేహానికి (Friendship) కాలం చెల్లిందని గుర్తుంచుకోవాలి.
అలసటగా అనిపించడం:
వారితో గడిపిన తర్వాత మీకు ఉత్సాహంగా ఉండాల్సింది పోయి, మానసికంగా బాగా అలసిపోయినట్లు అనిపిస్తుంటే అది ప్రమాదకరమైన హెచ్చరిక.
వయసు పెరిగేకొద్దీ మనం ఎవరికి సమయం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే విషయంలో స్పష్టత వస్తుందని రోజ్ కోల్తార్ట్ పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో గొడవలు పడటం కంటే, సైలెంట్‌గా ఆ బంధం నుంచి తప్పుకోవడం ఇద్దరికీ మంచిదని ఆమె సూచించారు. ఇద్దరు వ్యక్తులు వేర్వేరు దిశల్లో ఎదగడం సహజమని, ఇందులో ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
Read Also: పెళ్లి వాయిదా వేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే!
Follow Us On : WhatsApp

