కలం, స్పోర్ట్స్ : ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతున్న వేళ భారత హాకీ జట్టులో రిటైర్మెంట్ వివాదం రాజుకుంది. సీనియర్ డిఫెండర్ జర్మాన్ప్రీత్ సింగ్‌తో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లను ఈ టోర్నీ తర్వాత తొలగించనున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ వార్తలను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (Harmanpreet Singh) ఖండించారు. జట్టులో అలాంటి చర్చలేవీ జరగలేదని స్పష్టం చేశారు. సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించిన జర్మాన్ప్రీత్, మందీప్, అమిత్ రోహిదాస్, నీలకంఠ శర్మలకు ఇది చివరి టోర్నీ అని హాకీ ఇండియా భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ కోసం కొత్త రక్తాన్ని నింపే యోచనలో బోర్డు ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని జర్మాన్ప్రీత్ స్పష్టం చేశారు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఆడి స్వర్ణం గెలవడమే తన తదుపరి లక్ష్యమని తెలిపారు. ఆసియా క్రీడల్లో పసిడి గెలిచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం జట్టుకు పెద్ద విజయమని అన్నారు. శ్రమించి తన డిఫెండింగ్ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నట్లు చెప్పారు.
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయినా ఏ ప్రత్యర్థినీ తక్కువగా అంచనా వేయబోమని డిఫెండర్ స్పష్టం చేశారు. ప్రణాళికాబద్ధంగా ఒక్కో మ్యాచ్‌పై దృష్టి సారిస్తామని వెల్లడించారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత పంజాబ్‌లో అంతర్జాతీయ హాకీ పోటీలు జరుగుతున్నాయి. 2009 గోల్డ్ కప్ తర్వాత అక్కడ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. సొంత గడ్డపై ఆడడం తమకు ఎంతో గర్వకారణమని ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం టోర్నీ మ్యాచ్‌లపైనే జట్టు సభ్యులంతా దృష్టి సారించారు.

