కలం, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్లో(West Bengal) సోషల్ మీడియా ఇన్ఫ్లెయెన్సర్లకు కాసుల పంట పండింది. త్వరలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనుండడంతో అన్ని పార్టీలూ ఇన్ఫ్లుయెన్సర్ల వేట మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఫాలోవర్లు, వ్యూస్‌ను బట్టి ఒక్కో రీల్‌కు రూ.20వేల నుంచి రూ.80వేల వరకు చెల్లించేందుకు సిద్ధపడుతున్నాయి. ఈ మేరకు వివిధ పార్టీల నుంచి తమకు వచ్చిన ఆఫర్ల మెసేజ్‌లు, మెయిల్స్ స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరలవుతున్నాయి.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కలిపి 43వేలకు పైగా ఫాలోవర్లు ఉన్న శాలిని ముఖర్జీ బెనర్జీ అనే ఇన్ఫ్లుయెన్సర్ తనకు రాజకీయ పార్టీల నుంచి ఆఫర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఎన్నికల్లో తమకు ప్రచారం చేస్తే ఒక్కో రీల్‌కు రూ.20వేలు ఇస్తామని, అయితే.. ఇన్‌స్టాగ్రామ్‌లో కనీసం 20వేల మంది ఫాలోవర్లు ఉండాలని, యావరేజ్ వ్యూస్ 10నుంచి 15వేలకు తగ్గకుండా ఉండాలని కండిషన్స్ పెడుతూ మెయిల్ చేసినట్లు తెలిపింది. బీజేపీ, టీఎంసీతోపాటు ఇతర పార్టీల నుంచి కూడా ఇలా ఆఫర్ వచ్చినట్లు పేర్కొంది. అలాగే తమకు డిజిటల్ క్యాంపెయినింగ్ చేస్తే ఒక్కో రీల్‌కు రూ.80వేలు ఇస్తామని ఆఫర్ వచ్చినట్లు కోల్‌కతాకు చెందిన ప్రముఖ లైఫ్‌స్టైల్ వ్లాగర్ కొనినిక దేవి సైతం వెల్లడించింది.
ఫాలోవర్లను బట్టి కేటగిరీలు, రేట్లు..
పార్టీలు ఎన్నికల్లో ప్రచారం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఫాలోవర్లను బట్టి కేటగిరీలుగా విభజించాయి. 10వేల నుంచి లక్షలోపు ఫాలోవర్లు ఉంటే మైక్రో, లక్ష నుంచి 10లక్షల వరకు ఉంటే మాక్రో, 10లక్షలు దాటితే మెగా ఇన్ఫ్లుయెన్సర్లుగా వర్గీకరించాయి. కొందరితో కేవలం ప్రచార రీల్స్ మాత్రమే చేయమని సంప్రదిస్తున్నాయి. మరికొందరిని పాడ్‌కాస్ట్‌లు, ఇంటర్వ్యూలు చేయమని అడుగుతున్నాయి. ఫాలోవర్లు, వ్యూస్, పనిని బట్టి లక్షల్లోనూ చెల్లించేందుకు సిద్ధమతున్నాయి. మొత్తానికి ఎన్నికల పుణ్యమా అని బెంగాల్లో(West Bengal) ఇన్ఫ్లుయెన్సర్లకు కాసుల వర్షం కురుస్తోంది.

