కలం, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ – బిజినేపల్లి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టురట్టైంది. ఈ ఆపరేషన్‌లో నిందితుల నుంచి మొత్తం 52 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ నాగర్‌కర్నూల్ (Nagarkurnool) ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ కేసులో జోంగం యాదయ్య, కృష్ణరాజు అలియాస్ శివకుమార్, చరణ్ కుమార్ అలియాస్ శరత్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా ప్రధాన సూత్రధారి సంతోష్ నాయక్ ప్రస్తుతం మహబూబ్‌నగర్ జైలులో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు ప్రధానంగా పల్సర్, షైన్, యూనికార్న్ వంటి ఖరీదైన మోటార్‌సైకిళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.
దర్యాప్తులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 20, సైబరాబాద్ కమిషనరేట్ పరిధి నుంచి 14, హైదరాబాద్ నుంచి 4, వనపర్తి నుంచి 3, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 3 బైకులను పోలీసులు రికవరీ చేశారు. అలాగే నాగర్‌కర్నూల్, బిజినేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధుల్లో చోరీకి గురైన మరికొన్ని వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 52 బైకులు రికవరీ చేయడం ఈ కేసులో కీలక విజయంగా నిలిచింది.
దొంగిలించిన బైకులను తక్కువ ధరలకు గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా మంగనూర్ గ్రామంలోనే 36 దొంగ బైకులను విక్రయించినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు. ఈ వాహనాలను కొనుగోలు చేసిన వారి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారని, వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేయడం, విక్రయించడం కూడా చట్టరీత్యా నేరమేనని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు తక్కువ ధరలకు వాహనాలు కొనుగోలు చేసే ముందు వాటి పత్రాలు, యాజమాన్య వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అలాగే వాహనం చోరీకి గురైన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.
ఈ బైక్ చోరీల ముఠాను ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐలు గోవర్ధన్, బిజినేపల్లి ఎస్ఐ షంషుద్దీన్‌తో పాటు భీముడు, వెంకటేష్, ప్రవీణ్, రమేష్ మరియు పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.

