Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రేమ ఒక్కసారేనా.. మళ్లీ మళ్లీ కలగదా?

కలం, వెబ్​ డెస్క్​ : ‘ప్రేమ ఒక్కసారే పుడుతుంది. ఒక్కరిపైనే పుడుతుంది. పదే పదే పుట్టదు’ ఇలాంటి డైలాగులు చాలా సినిమాల్లో వినుంటాం. చాలా మంది ఇది నిజమనే నమ్ముతారు కూడా. కానీ నిజానికి ప్రేమ (Love) అనే మధుర భావన ఒక మనిషిని జీవితంలో ఒక్కసారి మాత్రమే పలకరిస్తుందా. రెండోసారికీ, రెండో వ్యక్తిపై కానీ ఈ ప్రేమ అనే భావన కలగదా? ఇదే విషయంపై వెల్నెస్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ అదితీ గోవిత్రికర్ (Dr.Aditi Govitrikar) ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. సినిమాల్లో చెప్పినట్లు ప్రేమ (Love) ఒక్కసారే కలుగుతుంది? అనే విషయం ఈ జెన్‌జీ తరంలో కూడా తరచుగా చర్చల్లో ఉండే అంశమే. ఇదే క్రమంలో సాధారణంగా ఒక వ్యక్తి తన జీవిత కాలంలో మూడుసార్లు ప్రేమలో పడతాడనే ఒక సిద్ధాంతం కూడా ప్రచారంలో ఉంది.

దీనిపై స్పందించిన అదితీ గోవిత్రికర్.. ప్రేమకు పరిమితులు ఉండవని, అందులో అనేక లేయర్లు ఉంటాయని అభిప్రాయపడ్డారు. మనిషి జీవితంలో ఎదుగుతున్న కొద్దీ వేర్వేరు వ్యక్తులతోనే కాకుండా, కొత్త వ్యక్తులతో కూడా ప్రేమలో పడే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా వయసును బట్టి ప్రేమ అనుభూతి మారుతుందని అదితీ వివరించారు. యవ్వనంలో ఉండే ప్రేమ ఎంతో ఉద్వేగంగా, ఆవేశంగా, ఆకర్షణతో నిండి ఉంటుందని చెప్పారు. ఆ సమయంలో ప్రేమను కోల్పోతామనే భయం కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కానీ వయసు పెరిగే కొద్దీ జీవితానుభవాలు తోడై, ప్రేమలో నిలకడ వస్తుందని ఆమె విశ్లేషించారు. అప్పుడు ప్రేమ అనేది మరింత లోతైనదిగా, ప్రశాంతమైనదిగా మారుతుందని వెల్లడించారు.

మళ్లీ ప్రేమలో పడటం అనేది ఓటమికి సంకేతం కాదని, అది హృదయం నిబ్బరానికి నిదర్శనమని అదితీ గోవిత్రికర్ పేర్కొన్నారు. కొత్తగా ప్రేమను స్వీకరించడానికి సిద్ధంగా ఉండటం గొప్ప మానవ నైజమని కొనియాడారు. అనుభవం పెరిగే కొద్దీ మనకు ఏం కావాలో, మన భావోద్వేగ పరిధులు ఏంటో బాగా అర్థమవుతాయని చెప్పారు. పెద్దయ్యాక కేవలం ఆకర్షణ కంటే గౌరవం, భద్రత, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. ప్రేమ అనేది ఒకరి కోసం ఒకరు పుట్టడం కంటే, ఒకరిని ఒకరు ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడమేనని అదితీ స్పష్టం చేశారు. ప్రేమ ఎన్నిసార్లు కలిగింది అనే దానికంటే, కలిగిన ప్రతిసారీ అది ఎంత అర్థవంతంగా ఉందనేదే ముఖ్యమని ఆమె తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>