కలం, స్పోర్ట్స్: భారత పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లకు క్రమం తప్పకుండా ఆడే అవకాశాలు ఇవ్వకపోవడంపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ (Wasim Jaffer) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టులో రెండో, మూడో ప్రధాన ఫాస్ట్ బౌలర్లు ఎవరనే దానిపై మేనేజ్‌మెంట్‌కే స్పష్టత లేదని ఆయన వ్యాఖ్యానించారు. తమ వద్ద అత్యుత్తమ నాణ్యత కలిగిన బౌలర్లు ఉన్నప్పుడు వారిని రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేయడం సరైన పద్ధతి కాదని జాఫర్ అభిప్రాయపడ్డారు. 2027 వన్డే ప్రపంచకప్ ఎంతో దూరంలో లేదని, అందువల్ల షమీ తప్పక వన్డే జట్టులో ఉండాలని స్పష్టం చేశారు. బుమ్రా, షమీ, సిరాజ్ ముగ్గురూ తన తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ప్రత్యేకించి షమీని టెస్టు జట్టులోకి మళ్లీ తీసుకోవాలని తాను చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
రాబోయే పర్యటనలకు జట్టును ప్రకటించే సమయంలో షమీ, ఔకిబ్ నబీలపైనే తన దృష్టి ఉంటుందన్నారు. ఒకవేళ ఈసారి కూడా షమీని సెలెక్టర్లు పట్టించుకోకపోతే ఆయనకు జాతీయ జట్టు తలుపులు పూర్తిగా మూసుకుపోయినట్లేనని జాఫర్ కుండబద్దలు కొట్టారు. అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్ T20 సిరీస్ కోసం భువనేశ్వర్ కుమార్‌ను నాలుగేళ్ల తర్వాత జట్టులోకి తీసుకోవడాన్ని జాఫర్ స్వాగతించారు. భువిని ఎంపిక చేసి ఎవరూ దయ చూపలేదని, ఆయన ప్రదర్శనకు తగిన ప్రతిఫలం దక్కిందని పేర్కొన్నారు. యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులను కూడా సమానంగా గౌరవించాలని హితవు పలికారు.

