కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal)లో ఆటో డ్రైవర్ల కోసం రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. బుధవారం కాజీపేట (Kazipet) రైల్వే ఆడిటోరియంలో వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “ఆరైవ్ అలైవ్” (Arrive Alive) రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం భాగంగా నేటి నుంచి ఈ నెల 31 వరకు నిర్వహించబడుతుంది.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ (Sunpreet Singh) మాట్లాడుతూ.. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేయడం ప్రతి ఆటో డ్రైవర్ ప్రధాన బాధ్యత. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం, పరిమితికి మించి వాహనంలో ప్రయాణికులను ఎక్కించకూడదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ప్రతి డ్రైవర్ రోడ్డు నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఆటో డ్రైవర్ల (Auto Drivers)కు రోడ్డు భద్రతపై ముఖ్య సూచనలు ఇచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్ వద్ద జాగ్రత్తలు, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న డ్రైవర్లు రోడ్డు భద్రతపై తమ బాధ్యతను గుర్తించి, నిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ట్రాఫిక్ కాజీపేట ఏసీపీ సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు వెంకన్న, సీతారెడ్డి, సుజాత, అలాగే కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఇతర పోలీసులు పాల్గొన్నారు.

