కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) జిల్లా నర్సంపేట (Narsampet) పట్టణ పరిధిలోని మాధన్నపేట చెరువు వద్ద తీవ్ర కలకలం రేగింది. చెరువులో అక్రమంగా మొరం తవ్వుతున్నారనే సమాచారంతో, దానిని అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై అక్రమార్కులు దాడికి పాల్పడ్డారు. మాధన్నపేట చెరువు నుండి కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తుండటంతో రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో మొరం దందాదారులను అధికారులు నిలదీయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన అక్రమార్కులు రెవెన్యూ అధికారులపై దాడికి తెగబడ్డారు. ఇద్దరు అధికారులను బలవంతంగా ఒకచోట బంధించి, వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను లాక్కున్నారు.
ఈ దాడిలో జీపీఓ నరసింహస్వామితో పాటు మరొక రెవెన్యూ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. అక్రమార్కుల బారి నుంచి తప్పించుకున్న బాధితులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అధికారుల రక్షణకే ముప్పు వాటిల్లేలా జరిగిన ఈ ఘటనపై రెవెన్యూ వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నర్సంపేట పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

