రైతుల సాగు కష్టాలకు చెక్.. ధర్మసాగర్ నుంచి నీటి విడుదల

కలం, హనుమకొండ: రైతులకు అండగా నిలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు (MLA KR Nagaraj) అన్నారు. సోమవారం ధర్మసాగర్ రిజర్వాయర్ (Dharmasagar Reservoir) సౌత్ కెనాల్ నుంచి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) తో కలిసి సాగునీటిని విడుదల చేశారు. ఎల్‌నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులకు ఉపశమనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రిజర్వాయర్ నుంచి విడుదలైన జలాలకు పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. హసన్‌పర్తి, ఐనవోలు, వర్ధన్నపేట మండలాల పరిధిలోని రైతులకు సాగునీరు అందించేందుకు సౌత్ కెనాల్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశామని చెప్పారు. దీంతో కాలువ ఆయకట్టు పరిధిలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతుల సాగునీటి సమస్యకు కొంత మేర పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని నీటి పంపిణీ కొనసాగుతుందని, రానున్న రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిస్తే రైతులకు నిరంతరంగా సాగునీరు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, మాజీ జెడ్పీటీసీ బానోత్ సింగులాల్, డివిజన్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు, సర్పంచులు, అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>