కలం, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ డేటా లీక్ (Bank of Baroda Data Leak) తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ బ్యాంక్ ఖాతాదారుల ఆధార్ వివరాలు, లోన్ అకౌంట్ నెంబర్స్, కార్పొరేట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారం ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టినట్లు పలు కథనాలు రావడంతో కస్టమర్లలో భయం మొదలయింది. దాదాపు 1 టెరాబైట్‌కు పైగా డేటా లీక్ అయినట్లు జరుగుతున్న ఈ ప్రచారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కార్పొరేట్ బ్యాంకింగ్ ఖాతాలకు సంబంధించిన సమాచారం కూడా లీక్ అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.
దేశ ఆర్థిక రంగంలో కీలకమైన భద్రతా సమస్యలుగా డేటా లీక్ ఘటనలు మారుతున్నాయి. వ్యక్తిగత వివరాలు లీక్ అయితే ఆన్ లైన్ మోసాలు, గుర్తింపు దుర్వినియోగం, ఫిషింగ్ దాడులు జరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు తమ బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని.. సోషల్ మీడియాలో అసత్యాలు రాసేవారిపట్ల జాగ్రత్తగా పరిశీలించాలని పేర్కొన్నారు.

