గుడిలో ప్రసాదం తీసుకెళ్లడంపై నిషేధం ఉన్న 5 ఆలయాలు ఇవే

కలం, వెబ్‌డెస్క్: సాధారణంగా మనం గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకున్న తర్వాత ప్రసాదం పెడతారు. ఈ ప్రసాదాన్ని భక్తులు తమ కుటుంబ సభ్యులతో పంచుకునేందుకు ఇంటికి తీసుకెళ్తుంటారు. కానీ కొన్ని ఆలయాలలో ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లడంపై నిషేధం (Prasadam Rules) ఉందని మీకు తెలుసా? అవును భారతదేశంలోని కొన్ని ప్రత్యేక దేవాలయాలలో ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణం వెలుపలికి తీసుకెళ్లనివ్వరు. ఆ ఆలయాలు ఏవో, ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కామాఖ్య దేవాలయం

అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో నీలాచల్ పర్వతంపై వెలసిన కామాఖ్య దేవాలయం ప్రత్యేక తాంత్రిక సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటిగా ఈ ఆలయాన్ని పరిగణిస్తారు. స్థానిక విశ్వాసాల ప్రకారం, దేవాలయంలో అందించే ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణం బయటకు తీసుకెళ్లడం సంప్రదాయ విరుద్ధంగా భావిస్తారట.

2. కాలభైరవ ఆలయం

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉజ్జయినిలో కాలభైరవ ఆలయం ఉంది. ఈ ఆలయం శివుడి ఉగ్రరూపమైన కాలభైరవ స్వామికి అంకితం చేయబడింది. ఇక్కడ భక్తులు కాలభైరవునికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పించడం ప్రత్యేకత. ఆలయంలో సమర్పించిన నైవేద్యాలు పూర్తిగా దేవుడికే చెందుతాయని భక్తుల నమ్మకం. అందువల్ల వాటిని సాధారణ ప్రసాదంలా ఇంటికి తీసుకెళ్లడం లేదా ఇతరులకు పంచడం చేయకూడదని పండితులు చెబుతున్నారు.

3. మెహందీపూర్ బాలాజీ ఆలయం

రాజస్థాన్‌ రాష్ట్రంలోని మెహందీపూర్ బాలాజీ ఆలయం ప్రతికూల శక్తుల నివారణకు ప్రసిద్ధి చెందింది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయంలో సమర్పించిన ప్రసాదాన్ని లేదా ఆహారాన్ని బయటకు తీసుకెళ్లకూడదట. భక్తులు అక్కడే ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లడం ఆనవాయితీ.

4. కోటిలింగేశ్వర ఆలయం

కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో కోటిలింగేశ్వర ఆలయం ఒకటి. ఇక్కడ శివునికి సమర్పించిన ప్రసాదంపై చండేశ్వరుని ప్రతీకాత్మక అధికారం ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు. అందుకే అనేక మంది భక్తులు ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా ఆలయ ప్రాంగణంలోనే స్వీకరించాలని కఠిన సంప్రదాయం ఉందట.

5. మహూది జైన దేవాలయం

గుజరాత్‌ రాష్ట్రంలోని మహూది జైన దేవాలయం “సుఖ్డీ” అనే ప్రత్యేక ప్రసాదానికి ప్రసిద్ధి. సంప్రదాయం ప్రకారం, ఈ ప్రసాదాన్ని దేవాలయ ప్రాంగణంలోనే తినాలి. దానిని బయటకు తీసుకెళ్లడం అశుభంగా పరిగణిస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>