తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ‘సర్’ పరీక్ష

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ‘సర్’ ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. అదే సమయంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షగా తయారైంది. ఇంకోవైపు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆశావహులకు సైతం ‘సర్’ పరీక్ష పెడుతున్నది. ఇందులో పాస్ అయినవారికే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కుతుందనే సంకేతాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లాయి.

‘సర్’ ప్రక్రియ ముగిసిన తర్వాత ఏ లీడర్ హిట్.. ఏ లీడర్ ఫట్.. అనేది తేలనున్నది. దానికి తగ్గట్టు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం, ఇవ్వకపోవడంపై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోనున్నది. పార్టీ కోసం పనిచేయనప్పుడు, ఆదేశాలను పట్టించుకోనప్పుడు టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నది పీసీసీ, ఏఐసీసీ వాదన.

ఈసారి ‘సర్’లో ఏ ఎమ్మెల్యే, ఏ ఆశావహుడు సక్సెస్ అవుతారో వారికి టికెట్ ఖాయంలా కనిపిస్తున్నది. అదే కార్పొరేషన్ల పదవుల్లో ఉన్నవారికి రెన్యూవల్ ఉంటుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించినవారికి, ఇనాక్టివ్‌గా ఉన్నవారికి అటు టికెట్లు, ఇటు పదవులు, ఇంకోవైపు రెన్యూవల్స్ ఉండకపోవచ్చన్న మాటలు గాంధీభవన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ఓటర్ లిస్ట్ ప్రత్యేక సవరణ (సర్).. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, లీడర్లకు పరీక్షగా మారింది. దానిలో చూపెట్టే పర్ఫార్మెన్స్ ఆధారంగానే వారికి టికెట్లు ఇవ్వడం, ఇవ్వకపోవడం.. పార్టీలో భవిష్యత్తు ఉండటం, ఉండకపోవడం అనేది తేలనుంది. సర్కు గడువు ఆగస్టు 3 వరకు ఉండటంతో.. ఏ ఒక్క ఓటరు పేరు జాబితా నుంచి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ఎమ్మెల్యేలు, లీడర్లకు పార్టీ అప్పగించింది. కొందరు నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఇప్పటికే పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారు. ఇలాగే కొనసాగితే సహించేది లేదని, సర్ ముగిసిన తర్వాత అందరి భవిష్యత్తు తేలుస్తామని, నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం తప్పదనే స్థాయిలో ఆదేశాలు కూడా వెళ్లాయి.

సీఎం, పీసీసీ చీఫ్ దగ్గర రిపోర్టులు

‘సర్’ ప్రక్రియలో కాంగ్రెస్ లీడర్లలో చురుగ్గా పాల్గొంటున్నదెవరు, నిర్లక్ష్యంగా ఉంటున్నదెవరు, లైట్‌గా తీసుకున్నదెవరు.. ఇలాంటి వివరాలన్నీ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ దగ్గర ఉన్నాయి. ఆ మధ్య నిర్వహించిన జూమ్ మీటింగులో సైతం.. ‘సర్’ గురించి అంటీముట్టనట్లుగా ఉన్న ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆగస్టు 3వ తేదీ వరకు ‘సర్’ కొనసాగుతున్నందున ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని, హైదరాబాద్‌కు రావొద్దని ఆయన స్పష్టం చేశారు.

పదవులు, పైరవీలు, పనుల కోసం గాంధీభవన్‌కు రావొద్దని.. సెగ్మెంట్లలోనే ఉండి ‘సర్’ పనులు చూసుకోవాలని తేల్చిచెప్పారు. నాలుగు చోట్ల ఇప్పటివరకు ‘సర్’ గురించి ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని ఆ నాలుగు నియోకవర్గాల పేర్లనూ ముఖ్యమంత్రి వెల్లడించారు. 45 నియోజకవర్గాల్లో నామమాత్రంగానే జరుగుతున్నదని కూడా లిస్టు చదివి వినిపించారు. దీంతో ఆగస్టు 3 తర్వాత ఏం జరగనున్నదనే టెన్షన్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మొదలైంది.

పార్టీ లీడర్లకే ‘సర్’ బాధ్యతలు

నియోజకవర్గాల్లోని అర్హులైన ఓటర్ల పేర్లన్నీ జాబితాలో ఉండేలా చూసుకోవడం మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నాయకుల బాధ్యతగా మారింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ‘సర్’ పరీక్షలో పాస్ కావడం తెలంగాణ కాంగ్రెస్‌లో కీలకంగా కనిపిస్తున్నది. ఓటర్ లిస్ట్ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పార్టీ అధిష్ఠానం కేవలం ఎన్నికల ప్రక్రియగా కాకుండా, క్షేత్రస్థాయిలో నాయకత్వ సామర్థ్యాన్ని కొలిచే రాజకీయ ప్రమాణంగా మార్చింది.

ఎమ్మెల్యే నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకుడి వరకు ఎవరు ఎంత చురుగ్గా పనిచేస్తున్నారనే అంశమే రానున్న రోజుల్లో పార్టీ తీసుకునే నిర్ణయాలపై ప్రభావం చూపనున్నది. అందుకే సీఎం రేవంత్, పార్టీ స్టేట్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ రెగ్యులర్గా రాష్ట్రవ్యాప్తంగా సర్ పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నివేదికలను తెప్పించుకుంటున్నారు. ఆగస్టు 3 వరకు ప్రతి ఎమ్మెల్యే, ముఖ్య నాయకుడు తప్పనిసరిగా తన నియోజకవర్గంలోనే ఉండి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై దృష్టి పెట్టాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

నిర్లక్యానికి మూల్యం తప్పదా?

సర్ ను కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్‌గా తీసుకున్నందున నిర్లక్ష్యం ప్రదర్శించే నేతలకు భవిష్యత్తులో రాజకీయంగా నష్టం తప్పదన్న సంకేతాలు వెళ్లాయి. సర్ ప్రక్రియ కేవలం ఓటర్ల పేర్ల పరిశీలన కార్యక్రమమే కాదని, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, టికెట్ ఆశిస్తున్న నాయకులు, మండల స్థాయి బాధ్యులు, బూత్ కమిటీలు ఎంత చురుకుగా పనిచేస్తున్నారనే విషయాన్ని అంచనా వేసే ప్రక్రియ అని.. వీటన్నింటినీ మించి పార్టీ నిర్ణయాలను అమలు చేసే సిన్సియారిటీకి కొలమానం అనే సంకేతం లీడర్లకు చేరింది.

క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు?.. కేవలం సమావేశాలకే పరిమితమైంది ఎవరు?.. బూత్ స్థాయిలో పనిచేస్తున్నదెవరు?.. పార్టీ బీఎల్ఏలతో నిత్యం రివ్యూ చేస్తూ గైడెన్సు ఇస్తున్నదెవరు?.. ఇలాంటి వివరాలన్నింటినీ కాంగ్రెస్ నాయకత్వం విశ్లేషిస్తున్నది. ఆగస్టు 3 తర్వాత.. ఆయా నియోజకవర్గాల్లో గతంలో ఉన్న ఓటర్లు ఎందరు? ‘సర్’ తర్వాత డిజిటలైజేషన్‌లో మిగిలింది ఎందరు? అన్ని ఓట్లు డిలీట్ అవుతూ ఉంటే ఎందుకు పట్టించుకోలేదు?.. ఇలాంటివన్నింటినీ పార్టీ ఆరా తీయనుంది. ఇందుకు తగ్గట్టుగానే ఒకవైపు చర్యలు, మరోవైపు భవిష్యత్తులో అవకాశాలు డిసైడ్ కానున్నట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం.

చివరి అవకాశంగా నాలుగు రోజులు!

ఇప్పటికే ముఖ్యమంత్రి దగ్గర అన్ని నియోజకవర్గాల్లోని ‘సర్’ నివేదికలు ఉన్నాయి. వారం రోజుల క్రితమే జూమ్ మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్ల పర్ఫార్మెన్స్ గురించి వివరించారు. ఈ నెల 30 వరకు యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి రిజల్ట్ రాబట్టాలని స్పష్టం చేశారు. అప్పటివరకు జరిగిన ప్రోగ్రెస్‌పై మరోమారు సీఎం రేవంత్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ జులై 30న రివ్యూ చేస్తారు. ‘సర్’ గడువు ఆగస్టు 3 వరకు ఉన్నందున మిగిలిన నాలుగు రోజుల పాటు గడువు ఇచ్చి టార్గెట్ ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం.

చివరికి ఏయే నియోజకవర్గంలో ‘సర్’ కారణంగా ఎన్న ఓట్లు డిలీట్ అయ్యాయో, ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో, అవసరమైన డాక్యుమెంట్లను బీఎల్వోలకు అందించడంలో ఏం లోపం జరిగిందో, పార్టీ బీఎల్ఏలు ఏం చేస్తున్నారు, వారిని గైడ్ చేసే ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలు, డీసీసీ ప్రెసిడెంట్లు ఎందుకు సీరియస్‌గా లేరు.. ఇలాంటి అన్ని అంశాలపై లోతైన రివ్యూ జరగనున్నది. ఆ తర్వాత వారికి పార్టీ పనుల అప్పగింత, సంస్థాగత బాధ్యతలు ఇవ్వడం, నామినేటెడ్ పోస్టులకు అవకాశం కల్పించడం, భవిష్యత్తులో ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీ/ ఎంపీ టికెట్లపై నిర్ణయం… ఇలాంటివన్నీ తేలనున్నాయి. ‘సర్’ పరీక్షలో పాస్, ఫెయిల్ వివరాలు బహిర్గతం కానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>