కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal Police) కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలో ఒకే కేసులో ఇద్దరు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. జనగామ జిల్లా నర్మెట్ట సర్కిల్ ఇన్ స్పెక్టర్ (CI) యం. అబ్బయ్యతో పాటు గతంలో బచ్చన్నపేట సబ్ ఇన్ స్పెక్టర్ (SI)గా పనిచేసి, ప్రస్తుతం ఏఆర్ అటాచ్డ్‌లో ఉన్న షేక్ హమీద్‌లను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
గత కొంతకాలంగా ఈ ఇద్దరు అధికారులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు, వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిజమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో శాఖాపరమైన క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఇరువురు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు సీపీ సన్‌ప్రీత్ సింగ్ తన ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈ ఘటన స్థానిక పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

