కలం, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలపై పోలీస్ కమిషనర్ శ్వేత (Warangal CP) ప్రత్యేక దృష్టి సారించారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా గురువారం నేషనల్ హైవే అథారిటీ, రోడ్డు రవాణా శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి హనుమకొండ–హైదరాబాద్ మార్గంలోని బ్లాక్ స్పాట్లపై దృష్టి సారించారు. ఈ మేరకు కరుణాపురం నుంచి పెంబర్తి వరకు ఉన్న 10కిపైగా బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్డు పరిస్థితులు, డివైడర్ ఓపెనింగ్‌లు, గ్రామాలకు వెళ్లే అనుసంధాన రహదారులను పరిశీలించారు. ప్రమాదాలకు దారితీసే కారణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
రాత్రి వేళల్లో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా డివైడర్ ఓపెనింగ్‌లు, గ్రామాల కూడళ్ల వద్ద తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, దిశా నిర్దేశక సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి వెంట ఉన్న మద్యం దుకాణాల వద్ద పార్కింగ్‌ను క్రమబద్ధీకరించేందుకు ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. కరుణాపురం వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని ప్రజలు చేసిన విజ్ఞప్తిని పరిశీలించారు. అలాగే పాదచారుల వంతెనల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారి అధికారులకు సూచించారు.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ను పరిశీలించారు. గోల్డెన్ అవర్‌లో బాధితులకు వేగంగా సేవలు అందేలా మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు, ఘనపూర్ ఏసీపీ భీంశర్మ, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ భరద్వాజ్, మేనేజర్ లింగయ్య, ఇన్‌స్పెక్టర్లు వేణు, చేరాలు, ఎస్‌ఐలు నవీన్ కుమార్, శ్రవణ్ కుమార్, ఆర్‌ఎస్‌ఐ నవీన్‌తో పాటు రోడ్డు రవాణా శాఖ, ఎక్సైజ్ శాఖ, జాతీయ రహదారి అథారిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

