కలం, నిర్మల్: పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఉచిత శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) సూచించారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా పోలీసు అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లాంటి దూర ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగ శిక్షణ పొందడం ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయమని, జిల్లా కేంద్రంలోనే అభ్యర్థులకు అందుబాటులో ఉన్న ఈ శిక్షణ ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుత కృత్రిమ మేధ (ఏఐ) కాలంలో ఉద్యోగం పొందడం కష్టంతో కూడుకున్న పని అని, ప్రస్తుతం ఉద్యోగాలకు ఎంతో పోటీ ఉందని, ప్రతి ఒక్కరు కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని సూచించారు.
ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడాలి: ఎస్పీ జానకి షర్మిల
పోలీసు ఉద్యోగమే లక్ష్యంగా ప్రతి ఒక్క అభ్యర్థి కష్టపడి చదువుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జిల్లా అభ్యర్థులకు ఉచిత పోలీసు శిక్షణలో సహకరించిన వారికి, స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత పోలీసు శిక్షణకు దాదాపు 300 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారని చెప్పారు. అభ్యర్థులకు ఒక పూట ఉచితంగా భోజనం, అల్పాహారం, అవసరమైన తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. సుదూర ప్రాంత విద్యార్థులకు అవసరమైన వసతి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, డీఎస్పీ శ్రీనివాస్, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

