కలం, వరంగల్ బ్యూరో : వరంగల్(Warangal) జిల్లా ఖిలా వరంగల్ మండలం తిమ్మాపూర్ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ సీలింగ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ సత్య శారదా (Collector Satya Sharada) సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. ఈ భూభాగోతంపై జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి నిర్వహించిన సమగ్ర విచారణలో తహసీల్దార్ అక్రమాలకు పాల్పడి సీలింగ్ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. ఈ నివేదికను ఆమె ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు.
కలెక్టర్ సీరియస్, షోకాజ్ నోటీస్ జారీ!
అడిషనల్ కలెక్టర్ ప్రాథమిక విచారణలో తహసీల్దార్ ఉద్దేశపూర్వక అక్రమాలు నిరూపితం కావడంతో జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. సదరు అధికారికి షోకాజ్ నోటీస్ జారీ చేస్తూ తక్షణ వివరణ కోరినట్లు రెవెన్యూ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. వివాదాస్పద భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారంలో తహశీల్దార్ ఆర్డీవోను తప్పుదోవ పట్టించినట్లు నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. నోటీసు అందుకున్న తహశీల్దార్ ఇచ్చే వివరణ ఆధారంగా కలెక్టర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు రెవెన్యూ వర్గాలలో చర్చ జరుగుతుంది. మొత్తం మీద వివాదాస్పద భూమి వ్యవహారంలో తహశీల్దార్ పై వేటు పడే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

