కలం, వరంగల్ : ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా చూడటంతో పాటు, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లాభసాటి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వరంగల్ కలెక్టర్ డా. సత్య శారదా (Collector Satya Sharada) అధికారులను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ, సహకార శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మార్క్‌ఫెడ్ అధికారులు, ఎరువుల డీలర్లు, క్షేత్రస్థాయి అధికారులతో వానాకాలం సాగు ముందస్తు ఏర్పాట్లు, ఎరువుల పంపిణీ, పంట మార్పిడి (Crop Rotation) విధానాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Satya Sharada) మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున వర్షాభావ పరిస్థితులను తట్టుకునే కందులు, జొన్నలు తదితర ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులకు పంట మార్పిడి ప్రయోజనాలపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో రైతుల అవసరాలకు అనుగుణంగా అదనపు యూరియా పంపిణీ కేంద్రాలను గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని మండల వ్యవసాయ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లకు సూచించారు. రైతులు ఎరువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామాలకు సమీపంలోనే పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఫర్టిలైజర్ డీలర్ కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, రద్దీని నియంత్రించేందుకు అవసరమైన చోట వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి రైతుకు సకాలంలో యూరియా అందేలా వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరతను అరికట్టేందుకు అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, మండలాల స్పెషల్ ఆఫీసర్స్, తహసిల్దార్లు, ఎరువుల డీలర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: తెలంగాణలో మాఫియా రాజ్యమేలుతోంది: కేటీఆర్
Follow Us On: Instagram

