కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : కొడంగల్ (Kodangal) నియోజకవర్గంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం, SIR అవగాహన సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud), సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్, కొప్పుల మహేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, పాలమూరు-రంగారెడ్డి (Palamuru-Rangareddy Project) ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తలు కష్టకాలంలోనూ వెన్నంటి నిలిచారని, వారి సేవలు మరువలేనివని తెలిపారు. ప్రతి ఒక్కరూ SIR కార్యక్రమంలో పాల్గొని ఓటు హక్కు పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామని, దేశంలోనే పెద్ద పార్టీగా ఎదుగుతోందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ, రైతుబంధు, రుణమాఫీ, పెన్షన్లు, బీసీ వర్గాల హామీలపై ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారిందని విమర్శించారు. రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
Read Also: తెలంగాణలో మాఫియా రాజ్యమేలుతోంది: కేటీఆర్
Follow Us On: Instagram

