కలం, వనపర్తి: 2019 వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కమిటీలను తక్షణమే ఏర్పాటు చేయాలని క్యాట్కో (కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్, విజిలెన్స్) ఈసీ సభ్యుడు బంకల రవీందర్ కోరారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బంకల రవీందర్ మాట్లాడుతూ.. విద్య, వైద్యం, రవాణా, తూనికలు–కొలతల లాంటి కీలక రంగాల్లో వినియోగదారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో పనిచేసిన ఆహార సలహా సంఘాల తరహాలో ప్రస్తుతం వినియోగదారుల హక్కుల చట్టం–2019 ప్రకారం కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కమిటీలు ఏర్పాటుచేస్తే ప్రజల సమస్యలు నేరుగా అధికారుల దృష్టికి వెళ్లి వేగంగా పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. వినియోగదారుల సంఘాల ప్రతినిధులకు ఈ కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పిస్తే, ప్రజా సమస్యలపై చర్చలు జరిగే అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు. వనపర్తి (Wanaparthy) జిల్లాలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్, విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసి, వినియోగదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

