Mobile Popup Ad
Mobile Popup Ad

ఇండోనేషియా ఓపెన్‌లో సింధు శుభారంభం..

క‌లం, వెబ్ డెస్క్: టాప్-10లోకి తిరిగి వచ్చిన పీవీ సింధు (PV Sindhu).. ఇండోనేషియా ఓపెన్ (Indonesia Open) 2026ను విజయంతో ప్రారంభించింది. జకార్తాలో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ ప్లేయర్ బుసానన్ ఒంగ్‌బామ్‌రుంగ్‌ఫాన్‌పై సింధు 25-23, 21-16తో గెలిచి రెండో రౌండ్‌కు చేరుకుంది. ఇస్టోరా సెనయాన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు గట్టి పోరాటం చేసింది. తొలి గేమ్ చివరి వరకు ఉత్కంఠగా సాగినా, దూకుడు ఆటతో 25-23తో సింధు ఆధిక్యం సాధించింది. అదే జోరును రెండో గేమ్‌లోనూ కొనసాగించి 21-16తో స్ట్రెయిట్ సెట్లలో మ్యాచ్ ముగించింది.

ఈ విజయంతో బుసానన్‌పై సింధు వరుసగా 11వ విజయం నమోదు చేసింది. ఇద్దరి హెడ్ టు హెడ్ రికార్డులో కూడా సింధు 21-1 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు సింధుకు అసలు పరీక్ష ముందుంది. రెండో రౌండ్‌లో ఆమెకు ఒలింపిక్ ఛాంపియన్, ప్రపంచ నంబర్-1 యాన్ సె యంగ్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ ఇద్దరి మధ్య జరిగిన పోరుల్లో సింధు ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవలేదు. గత వారం సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో కూడా సింధు కొరియా స్టార్ చేతిలో ఓడిపోయింది.

ఇదే సమయంలో భారత పురుషుల డబుల్స్ జోడీ హరిహరన్ అంసకరుణన్, ఎంఆర్ అర్జున్ కూడా తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. మలేషియా మాజీ ఒలింపిక్ పతక విజేత టాన్ వీ కియోంగ్, అతని భాగస్వామి నూర్ మొహమ్మద్ అజ్రిన్ జంటపై 21-18, 21-10తో సులువుగా గెలిచారు. అయితే లక్ష్య సేన్‌కు నిరాశ ఎదురైంది. స్వదేశీ అభిమానుల మద్దతుతో బరిలో దిగిన ఇండోనేషియా ప్లేయర్ అల్వి ఫర్హాన్ 21-19, 21-16తో లక్ష్యను ఓడించాడు.

గత వారం సింగపూర్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్-1 షి యు కీని కూడా అల్వి ఓడించాడు. భారత్ డబుల్స్ జట్లకు మాత్రం ఇది కఠినమైన రోజుగా మారింది. రెండు నెలల తర్వాత కలిసి ఆడిన ట్రీసా జాలీ–గాయత్రీ గోపీచంద్ జోడీ, ఇండోనేషియా జట్టుకు ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిలా–తనిషా క్రాస్టో జంట, చైనా ఆరో సీడ్ జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. ఇప్పుడు భారత అభిమానుల దృష్టి మొత్తం పీవీ సింధు రెండో రౌండ్ పోరుపైనే ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>