కలం, వనపర్తి: తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు సహజ ప్రసవాలు ఎంతో మేలు చేస్తాయని, వైద్యపరమైన అవసరం ఉన్నప్పుడే సిజేరియన్ ప్రసవాలను ఆశ్రయించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) సూచించారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో సహజ ప్రసవాల ప్రాధాన్యతపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ వివేకానంద, ఇందిరాగాంధీ, రాజీవ్ చౌరస్తాల మీదుగా డిపో రోడ్డు చేరుకుని బస్టాండ్ వరకు కొనసాగింది. అక్కడ ప్రయాణికులకు సహజ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలను ఎమ్మెల్యే వివరించారు.
సహజ ప్రసవం ద్వారా తల్లి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని, శస్త్రచికిత్సతో తలెత్తే కొన్ని ఆరోగ్య సమస్యల ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. గర్భిణుల్లో ప్రసవంపై ఉన్న భయాలను తొలగించి, సరైన వైద్య సలహాలు పాటించేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, జనరల్ సెక్రటరీ బ్రహ్మచారి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, సర్పంచుల సంఘం అధ్యక్షుడు వాల్య నాయక్, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

