కరువు సాయంపై ప్రభుత్వం నిర్లక్ష్యం: జాన్ వెస్లీ

​కలం, ఖమ్మం బ్యూరో: ఎల్‌ నినో ప్రభావంతో 360కి పైగా మండలాల్లో కరువు పరిస్థితులు, 30 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ( John Wesley) విమర్శించారు. ఆదివారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయం సుందరయ్య భవన్‌లో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా, తక్షణమే వరికి ఎకరాకు రూ.30 వేలు, వాణిజ్య పంటలకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. కరువు నివారణ కోసం కేంద్రం నుంచి రూ.50 వేల కోట్లు తెచ్చేందుకు వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తూ కూలీలకు ఏటా 200 రోజుల పని, రోజుకు రూ.800 వేతనం కల్పించాలన్నారు.

హామీలను విస్మరించిన ప్రభుత్వం..

రెండు లక్షల ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇళ్ల హామీలను ప్రభుత్వం విస్మరించిందని జాన్ వెస్లీ ఆరోపించారు. రేషన్ కార్డుపై పది కేజీల బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘సర్’ పేరుతో తెలంగాణలో 93 లక్షల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని జాన్ వెస్లీ మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త నిరసనలకు, అలాగే లేబర్ కోడ్ల రద్దుకై డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు కార్మిక సంఘాలు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మీ, బండారు రవికుమార్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి విక్రమ్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>