కలం, వెబ్ డెస్క్: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి (Megha Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన స్థానాలను గెలచుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కొన్ని స్థానాల్లో ఓటమి పాలవ్వడం.. ఎమ్మెల్యేలు, కీలక నేతల సొంత గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోవడం తెలిసిందే.
అయితే ఈ ఫలితాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతర్మథనంలో పడ్డారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి (Megha Reddy) మీడియాతో మాట్లాడుతూ.. ఇంటి దొంగల వల్లే కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాల్లో ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ‘కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓ పెద్ద మనిషి ఫోన్లు చేసి మరీ బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయమని చెప్పాడు. నిరంజన్ రెడ్డి బలపర్చిన అభ్యర్థులను దగ్గరుండి గెలిపించారు. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలు బయటపెడతా. 40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు వెన్నుపోడు పొడిచారు. వనపర్తి ప్రజల ముందు ఇదంతా బయటపెడతా అప్పుడు వాళ్లే పనిష్మెంట్ ఇస్తారు.’ అంటూ మేఘారెడ్డి (Megha Reddy) వ్యాఖ్యానించారు.
ఆ పెద్దమనిషి ఎవరు?
అయితే ఎమ్మెల్యే మేఘారెడ్డి (Megha Reddy) ఎవరి గురించి ప్రస్తావించారు? ఆయన ప్రస్తావించిన పెద్ద మనిషి ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఉండి వెన్నుపోటు పొడిచింది ఎవరు? అన్న చర్చ జరుగుతోంది. వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో సీనియర్ కాంగ్రెస్ నేత జిల్లెల చిన్నారెడ్డి ఉన్నారు. చిన్నారెడ్డి ప్రస్తుతం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో ఇద్దరు నేతలకు మధ్య ఆధిపత్యం కొనసాగుతోంది. అందుకే మేఘారెడ్డి సీనియర్ నేత అంటూ చిన్నారెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్లు చేశారా? అన్న చర్చ సాగుతోంది.


