కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వనపర్తి (Wanaparthy) కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశమందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్య నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్య ప్రకాశ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్యతో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదుదారుడికి పంపించటమే కాకుండా ఆన్‌లైన్‌లో పెట్టాలని ఆదేశించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేకపోతే సంబంధితశాఖకు లేఖ రాయాలని సూచించారు.
పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే పై అధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదుదారునికి స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. అంతే తప్ప తమ వద్ద పెండింగ్‌లో పెట్టుకోవద్దని సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చి పెండింగ్‌లో ఉన్న అర్జీలను సైతం సత్వరం పరిష్కరించాలని అన్నిశాఖల అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమంలో 59 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

