కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు అక్రమ మైనింగ్ సహజ వనరుల అక్రమ రవాణాను అరికట్టేందుకు సీసీఎస్ ఏసీపీ ఇన్‌చార్జ్ మస్తాన్ అలీ పర్యవేక్షణలో చీతా ఫోర్స్ బృందం ప్రత్యేక నిఘా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సోమవారం కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బషీరాబాద్ గ్రామ శివారులో గల కాడి చెరువు వద్ద అక్రమంగా మొరం తవ్వకాలు (Nizamabad Illegal Mining) జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు చీతా ఫోర్స్ సిబ్బంది ఆకస్మికంగా మెరుపు దాడి నిర్వహించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం అక్కడ అక్రమంగా మొరం తవ్వి తరలిస్తున్న కార్యకలాపాలను గుర్తించింది.
తనిఖీల సందర్భంగా మొరం తవ్వకాల కోసం వినియోగిస్తున్న ఒక జేసీబీ యంత్రం మొరాన్ని రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను అధికారులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ తవ్వకాల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించడమే కాకుండా పర్యావరణ సమతుల్యతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. చీతా ఫోర్స్ చేపట్టిన ఈ దాడి ద్వారా అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడటంతో పాటు, ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలిచింది.
స్వాధీనం చేసుకున్న జేసీబీ ఐదు ట్రాక్టర్లను తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల నిమిత్తం కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ కు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ మొరం, ఇసుక, మట్టి తవ్వకాలు రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వ సహజ వనరులను అక్రమంగా దోచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.

