కలం, మునుగోడు : తెలంగాణ గ్రామీణ పునర్నిర్మాణ సంస్థ (వీఆర్వో ) భూముల (VRO Lands) అక్రమ విక్రయాలపై సమగ్ర విచారణ జరిపి, సంస్థ ఆస్తులను కాపాడడంతో పాటు ఉపాధి కోల్పోయిన 186 మంది మాజీ ఉద్యోగులకు న్యాయం చేయాలని తెలంగాణ గ్రామీణ పునర్నిర్మాణ సంస్థ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సమితి అధ్యక్షులు వర్కల వెంకటేష్ ఆధ్వర్యంలో బాధిత మాజీ ఉద్యోగులు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాల్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.
రూ.220 కోట్ల భూ విక్రయాలపై విచారణ జరపాలి..
దివంగత ఫాదర్ ఎం.ఏ. విండే 1983లో స్థాపించిన తెలంగాణ గ్రామీణ పునర్నిర్మాణ సంస్థ నల్గొండ జిల్లాలోని 50కి పైగా గ్రామాల్లో పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి శిక్షణ వంటి సేవలు అందించిందని సమితి సభ్యులు తెలిపారు. అయితే ఆయన మరణానంతరం సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన వారు సంస్థ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
2021 నుంచి సంస్థకు చెందిన 100 ఎకరాలకు పైగా విలువైన భూములను అక్రమంగా విక్రయించి, సుమారు రూ.220 కోట్లకు పైగా నిధుల లావాదేవీలు జరిగినట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ భూ విక్రయాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పేదలకు సేవలందించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు.
కురుమేడు, దేవతపల్లి తండా, దేవరపల్లి, లక్కీ నాయక్ తండా, రాంరెడ్డిపల్లి, నాయవరం, తుంగతుర్తి తదితర ప్రాంతాల్లో సంస్థకు చెందిన భూములు విక్రయించినట్లు వినతిపత్రంలో వివరించారు. విద్యా, వైద్య కేంద్రాల కోసం కేటాయించిన భూములను అక్రమంగా అమ్మడం వల్ల పేద ప్రజలకు అందాల్సిన సేవలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా విక్రయించిన భూములన్నింటినీ తిరిగి సంస్థకు అప్పగించాలని, అవసరమైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అక్కడ విద్యా, వైద్య సంస్థలను కొనసాగిస్తూ పేదలకు ఉచిత సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
186 మంది మాజీ ఉద్యోగులకు న్యాయం చేయాలి..
1983 నుంచి 2025 వరకు సంస్థ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసిన 186 మంది మాజీ ఉద్యోగులను అర్ధాంతరంగా తొలగించడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని తెలిపారు. దశాబ్దాల పాటు నామమాత్రపు వేతనాలతో పనిచేసిన ఉద్యోగులకు తిరిగి ఉపాధి కల్పించాలని కోరారు. ప్రతి బాధిత కుటుంబానికి 120 గజాల ఇంటి స్థలం కేటాయించి పక్కా గృహం నిర్మించి ఇవ్వడంతో పాటు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
మాజీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, వారికి న్యాయం చేసేలా ఎమ్మెల్యే బాల్ నాయక్ చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు వర్కల వెంకటేష్‌తో పాటు మాజీ ఉద్యోగులు లలిత, వెంకటయ్య, కవిత, యాదమ్మ, జయమ్మ, ఈశ్వరి, కమల, తులసి, శాంతి, శారద, భాగ్య, వెంకటేశ్వర్లు, బాలమ్మ, వెంకటలక్ష్మి, అనిల్ కుమార్, స్వాతి, నిర్మల, స్వప్న, నరసింహ, కళావతి, సునీత, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

