అణ్వాయుధాల తగ్గింపుపై పుతిన్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: ప్రపంచంలో అణ్వాయుధాలను వెంటనే తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) స్పష్టం చేశారు. ఈ దిశగా రష్యాతో పాటు అమెరికా, చైనా దేశాలు కూడా కలిసిరావాలని పిలుపునిచ్చారు. చైనాలోని షెంజెన్ నగరంలో జిన్ పింగ్, ట్రంప్‌తో జరిగిన త్రైపాక్షిక చర్చల్లో పుతిన్ మాట్లాడారు. “అణ్వాయుధాలతో కలిగే ప్రమాదం ఊహకు కూడా అందదు. వాటి ద్వారా కలిగే ప్రమాదాలను తగ్గించుకునే విషయంలో చైనా, అమెరికా, రష్యా దేశాలకు ప్రత్యేకమైన అవకాశాలు కూడా ఉన్న విషయం మర్చిపోవద్దు. అయితే ఒకేసారి అణ్వాయుధాలను తగ్గించుకోవడం ఏ దేశ అధ్యక్షుడికైనా చాలా కష్టమైన పని. వేల సంఖ్యలో అణ్వాయుధాలు కలిగిన దేశాలు వాటిని వదులుకోవడమనేది అంత సులభం కాదు” అని జిన్ పింగ్, ట్రంప్‌ను ఉద్దేశించి పుతిన్ పేర్కొన్నారు. న్యూక్లియర్ వెపన్స్ ఇతర దేశాలకు విస్తరించకుండా చూడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

ఇరాన్‌కు అణ్వాయుధాలు దక్కనివ్వం: ట్రంప్

త్రైపాక్షిక చర్చలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ దేశానికి ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు దక్కనివ్వబోమని తేల్చి చెప్పారు. ఈ మేరకు అమెరికా గట్టి చర్యలు తీసుకుంటోందన్నారు. ఇక రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టం చేశారు. పుతిన్, తాను సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఈ రోజు కూడా దీని గురించి కొంతసేపు చర్చించామన్నారు. ఉక్రెయిన్ సైతం వీలైనంత త్వరగా యుద్ధాన్ని ఆపేస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇలాంటి చెత్త సంస్థల నుంచి తమ తమ దేశాల సౌర్వభౌమాధికారాన్ని కాపాడుకునే విషయంలో మరింత దృష్టి పెట్టాలన్నారు. ఆ కోర్టు పూర్తిగా నియంత్రణ కోల్పోయిందని మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>