ధాన్యం కొనుగోలు ప్రక్రియపై పాలమూరు కలెక్టర్ ఆరా

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ జడ్చర్ల మండలంలోని పత్తి మార్కెట్‌ యార్డు ను తనిఖీ చేసి మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. మార్కెట్‌యార్డ్‌లో కలియ తిరిగి మొక్క‌జొన్న కొనుగోలు లోడింగ్, ఆన్‌లోడింగ్, స్టోరేజ్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ మార్క్‌ఫెడ్, సహకారశాఖ అధికారులతో, రైతులతో కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటివరకు ఎన్ని బస్తాలు కొనుగోలు చేశారు? ఇంకా ఎన్ని బస్తాలు కొనుగోలు చేయాల్సి ఉంది? అని అడిగి తెలుసుకున్నారు. సుమారు 40 వేల బస్తాలు కొనుగోలు చేసి మార్కెట్ యార్డ్‌లో తాత్కాలికంగా స్టోరేజీ చేసినట్లు తెలిపారు. సుమారు 30 వేల బస్తాలు కొనుగోలు చేయాల్సి ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

సీరియల్ నంబర్ ప్రకారం టోకెన్లు

వీటికి సీరియల్ నంబర్ ప్రకారం టోకెన్‌లు జారీ చేసినట్లు, రెండు రోజుల్లో కొనుగోలు పూర్తి చేస్తామని కలెక్టర్‌కు వివరించారు. లోడింగ్, ఆన్ లోడింగ్ త్వరగా పూర్తి చేయుటకు హమాలీలను అదనంగా నియమించినట్లు కలెక్టర్‌కు వివరించారు. ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తిచేసి మహబూబ్‌నగర్ పట్టణంలో మార్క్ ఫెడ్ అధికారులు గుర్తించిన గోదాములకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. పీఏసీఎస్ అధ్యక్షులు కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి లోడింగ్ ఆన్‌లోడింగ్ త్వరగా గావించి గోదాము‌లకు రవాణా చేసేలా బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

చెల్లింపుల్లో ఇబ్బందులు రానివ్వొద్దు

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, రైతులకు చెల్లింపులు త్వరితగతిన జరగేలా చూడాలని సూచించారు. గన్నీ బ్యాగులు కొరత లేకుండా సరఫరా చేయాలని ఆదేశించారు. రైతుల ధాన్యాన్ని అకాల వర్షాల నుండి రక్షించేందుకు టార్పాలిన్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, గన్నీ బ్యాగులు సరిపడ అందుబాటులో ఉండేలా చూడాలని, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ ఉంచొద్దు

కొనుగోలు చేసిన ధాన్యాన్ని మార్కెట్ యార్డులో ఎక్కువకాలం నిల్వ ఉంచవద్దని స్పష్టం చేశారు. రవాణా కోసం తగిన సంఖ్యలో లారీలు, ట్రక్కులు ఏర్పాటు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. ఉదయం రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి.హరిప్రియ పత్తి మార్కెట్ యార్డ్ ను సందర్శించి మొక్క జొన్న కొనుగోలు ప్రక్రియను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి కృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్, మార్క్స్ ఫెడ్ డీఎం తహమీన, మార్కెట్ కార్యదర్శి సిరాజుద్దీన్, సహకారశాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ వేణుగోపాల్, జడ్చర్ల తహసీల్దార్ నర్సింగ్‌రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>