కలం, కరీంనగర్ బ్యూరో: ఆధునిక కాలంలో విద్యతో పాటు విలువలకు పట్టం కడుతూ, విద్యార్ధుల్లో సంబంధ బాంధవ్యాలు పెంపొందిస్తుంది వివేకానంద విద్యానికేతన్ (Vivekananda Vidyaniketan). నగరంలోని భగత్ నగర్ వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో తల్లిదండ్రులచే చిన్నారులకు ‘ఆశీర్వచన్’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాద పూజ చేసి ఆశీస్సులు పొందారు. పాదపూజలో పాల్గొన్న తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి భారతీయ సనాతన ధర్మంపై విశేష సేవలందిస్తున్న దక్షిణామూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణంలో పాఠశాల, సమాజం, కుటుంబం అత్యంత కీలకమని చెప్పారు. తల్లిదండ్రులు వారి పిల్లల అలవాట్లు, ప్రవర్తనను గమనించాలని.. వారికి సరైన దిశానిర్దేశం చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని సూచించారు.
ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి..
అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యా సంస్థల ఛైర్మన్ కొమురయ్య సౌగాని మాట్లాడుతూ.. విద్యార్థుల్లో అకడమిక్ ఎక్సలెన్స్ తో పాటు సంస్కారం, కుటుంబ బంధాలు ఆత్మీయత అనుబంధాలు, సామాజిక స్పృహ బాల్యం నుంచే బలపడేలా విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పారు. ప్రతి సంవత్సరం ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ చేపడుతూ, జిల్లాలోనే విద్యానికేతన్ (Vivekananda Vidyaniketan) ప్రత్యేకంగా ముందుకు వెళుతూ సమాజ మన్ననలు పొందడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి, విజయవంతం చేసిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మిథున్ జే మిస్త్రి, వైస్ ప్రిన్సిపాల్ సాగర్ సర్కార్, ఏవో తుంగాని సంపత్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Also: ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!
Follow Us On: X(Twitter)

