కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో మెజార్టీ సాధించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల వెనుక రిజర్వేషన్ల రద్దు కోణం ఉందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ (Jairam Ramesh) ఆరోపించారు. అందుకోసమే డీ లిమిటేషన్ బిల్లును మహిళా రిజర్వేషన్ల బిల్లుతో ముడి పెట్టి ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. 2024లో ఎన్డీయేకు తగినంత మెజార్టీ వచ్చి ఉంటే, ఎప్పుడో రిజర్వేషన్లను రద్దు చేసేది ఉండేదన్నారు. ఆ పని ఇప్పుడు మరింత వేగంగా చేస్తోందన్నారు.
నిజంగా మహిళా రిజర్వేషన్లను (Women Reservations) అమలు చేయాలనుకుంటే ఇప్పుడు 543 లోక్‌సభ సీట్లలోనే ఎందుకు చేయడం లేదన్నారు. దీని కోసం డీ లిమిటేషన్ బిల్లుతో ఎందుకు ముడిపెడుతున్నట్లు ప్రశ్నించారు. తాను మూడు బిల్లలును ఆమోదింపజేస్తానని ఏప్రిల్ నెలలో ప్రధాని మోదీ గొప్పలు చెప్పుకున్నారని.. అది జరగకపోయేసరికి అసహనంతో రగిలిపోతున్నారని జైరాం రమేశ్ విమర్శించారు.
పగబట్టిన ప్రధాని మోదీ..
ప్రధాని మోదీ పార్టీలపై పగబట్టారని జైరాం రమేశ్ ఆరోపించారు. తాను అనుకున్న బిల్లలు నెగ్గకపోయేసరికి ప్రాంతీయ పార్టీలపై ప్రతాపం చూపుతున్నారని మండిపడ్డారు. టీఎంసీ, శివసేన పార్టీలను నిలువునా చీల్చుతున్నారని.. రాజ్యసభలో వాటి బలం తగ్గించడానికి బీజేపీ పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందన్నారు. మోదీ నేరుగా రాజ్యాంగంపైనే దాడికి దిగారని, ఆయనతో సహా బీజేపీ నేతల్లో ఒక్కరికి కూడా రాజ్యాంగం అంటే ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు.
సమీప భవిష్యత్తులో కూడా బీజేపీ సొంతంగా లోక్ సభలో మెజార్టీ తెచ్చుకోబోదని జైరాం (Jairam Ramesh) తేల్చి చెప్పారు. ఆ పార్టీ అసలు ఉద్దేశం ఏంటో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అర్థమైందన్నారు. దేశానికి కొత్త రాజ్యాంగం కావాలనేదే కాషాయ నేతల అసలు లక్ష్యమన్నారు. అందుకే రాజ్యాంగ విరుద్ధంగా సీట్లు పెంచి, పార్టీలను కూల్చడానికి కూడా వెనుకాడబోవడం లేదని మండిపడ్డారు.
Read Also: ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!
Follow Us On: Instagram

