వినేష్ ఫోగట్ సెకండ్ ఇన్నింగ్స్.. కొత్త వెయిట్ కేటగిరీతో సిద్ధం!

కలం, స్పోర్ట్స్ : స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ (Vinesh Phogat) మళ్ళీ గోదాలోకి దిగబోతున్నారు. పారిస్ 2024 ఒలింపిక్స్ తర్వాత ఆమె ఆడబోయే మొదటి టోర్నీ ఇదే కావడం విశేషం. ఈసారి తన పాత వెయిట్ కేటగిరీని మార్చి.. 57 కేజీల విభాగంలో ఆమె పోటీ పడనున్నారు. మే 10 నుంచి 12 వరకు ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరిగే ‘నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్’ ద్వారా వినేష్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. వినేష్ కెరీర్ ఆరంభం నుండి తరచూ బరువు విభాగాలు మారుస్తూనే ఉన్నారు. 2014లో 48 కేజీల విభాగంలో కెరీర్ మొదలుపెట్టి ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచారు. ఆ తర్వాత 55 కేజీలు, 53 కేజీల విభాగాల్లోనూ రాణించారు. ముఖ్యంగా 53 కేజీల విభాగంలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 2018 ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకాలతో పాటు.. రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్ మెడల్స్ కూడా ఈ విభాగంలోనే సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ ఇదే కేటగిరీలో ఆడారు.

అయితే, పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం ఆమె 50 కేజీల విభాగంలో పోటీ పడ్డారు. అక్కడ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరినప్పటికీ.. నిర్ణీత బరువు కంటే ఎక్కువ ఉండటంతో అనర్హతకు గురయ్యారు. ఆ బాధతో రిటైర్మెంట్ ప్రకటించిన వినేష్ (Vinesh Phogat).. గతేడాది డిసెంబర్‌లో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌ లక్ష్యంగా మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ప్రస్తుతం జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడలకు అర్హత సాధించడమే వినేష్ ముందున్న ప్రధాన లక్ష్యం. గోండాలో జరిగే ఈ నేషనల్ టోర్నీ ఆమెకు చాలా కీలకం కానుంది. ఐదోసారి వెయిట్ కేటగిరీ మారుస్తూ 57 కేజీల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ టోర్నీలో ఆమె ప్రదర్శన ఎలా ఉంటుందోనని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also: తెలంగాణ కాంగ్రెస్ కి బీసీ లీడర్ల ప్రెజర్..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>