కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి (Vinayaka Chavithi) సందడి నెలకొంది. సోమవారం నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో ఎక్కడ చూసినా.. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. విద్యుత్ వెలుగుల్లో గణేష్ మండపాలు వెలిగిపోతున్నాయి. విభిన్న గణనాథుడి విగ్రహాలు.. ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వినాయక చవితి పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
విఘ్నాలు తొలగాలి: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించి, విజయాలను అందించే విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. గణనాథుడి కరుణకటాక్షాలతో ఇంటింటా సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు. వేసే ప్రతి అడుగులో విజయాన్ని సమకూర్చేలా, జ్ఞానాన్ని, ధైర్యాన్ని, సత్ప్రవర్తనను ప్రసాదించాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు.
గొప్ప సామాజిక పండుగ: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఊరూ వాడా, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా.. అందరినీ ఒకే చోటకు చేర్చే గొప్ప సామాజిక పండుగ వినాయక చవితి అన్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. మట్టి వినాయకులనే పూజిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు.
మట్టి వినాయకులను పూజిద్దాం: పవన్ కల్యాణ్
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. గణేషుడి ఆశీస్సుడి ప్రతి ఒక్కరిపై ఉండాలని, సుఖశాంతులతో ప్రజలు సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. ఏపీ వ్యాప్తంగా మట్టి వినాయకులనే పూజించాలని పిలుపునిస్తున్నానని, తద్వారా పర్యావరణ పరిరక్షణలో మన వంతు పాత్ర పోషించాలన్నారు. ప్రభుత్వ తరఫున ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
విజయాలు అందించే గణనాథుడు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించి, విజయాలను అందించాలని ఆకాంక్షించారు. దైవ పూజలు, ధార్మిక క్రతువులను విఘ్నేశ్వరుడి పూజతో ప్రారంభించడం హిందూ సంప్రదాయాల్లో ఎంతో విశిష్టమన్నారు. 9 రోజుల పాటు జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో రైతు కుటుంబాలు ఆనందంగా జీవించాలని కోరుకున్నారు.

