రాష్ట్రంలో టీజీ సేఫ్ విస్తృత త‌నిఖీలు!

క‌లం, వెబ్‌డెస్క్‌: రాష్ట్ర వ్యాప్తంగా క‌ల్తీ ఆహారంపై టీజీ సేఫ్ (TG SAFE) అధికారులు కొర‌డా ఝులిపిస్తున్నారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లోని ప‌లు స్వీట్ షాపులు, బేక‌రీల లైసెన్స్ ర‌ద్దు చేసి, నోటీసులు జారీ చేశారు. తాజాగా ఇత‌ర జిల్లాల్లో కూడా దాడుల‌ను ముమ్మ‌రం చేశారు. ఈ నేప‌థ్యంలో ఉమ్మ‌డి రంగారెడ్డి, వరంగ‌ల్ జిల్లాల్లోని 20 ఆహార త‌యారీ కేంద్రాల‌ను అధికారులు త‌నిఖీ చేశారు. ఈ త‌నిఖీల్లో భారీ ఆహార భ‌ద్ర‌తా ఉల్లంఘ‌న‌లు వెలుగు చూశాయి.

అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో త‌యారీ..

ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బందితో క‌లిసి 10 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు మసాలాలు, వంట నూనెలు, పాల ఉత్పత్తులు, స్వీట్స్, కూల్ డ్రింక్స్‌, ఇతర ఆహార పదార్థాలను తయారు చేసే యూనిట్లలో తనిఖీలు చేపట్టారు. ఆయా త‌యారీ కేంద్రాల్లో తుప్పు ప‌ట్టిన, శుభ్రంగా లేని యంత్రాలు, ప‌రిక‌రాలు వాడుతున్న‌ట్లు అధికారులు గుర్తించారు. అలాడే డేట్ అయిపోయిన‌, స‌రైన లేబులింగ్ లేని వ‌స్తువులు కూడా క‌నుగొన్నారు. ఓ త‌యారీ కేంద్రంలో భారీ ఎత్తున బూజు ప‌ట్టిన అల్లాన్ని గుర్తించారు. అలాగే ఈగ‌లు, దోమ‌లు, బొద్దింక‌లు, ఎలుక‌లు వంటివి ఆహార ప‌దార్థాల చుట్టూ తిరుగుతున్న‌ట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బంది ఎలాంటి గ్లౌజులు, హెయిర్ నెట్‌లు లేకుండా ప‌ని చేస్తున్న‌ట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ఆహార ప‌దార్థాల‌ను నేల పైనే త‌యారు చేస్తున్న‌ట్లు తెలిపారు.

9 యూనిట్ల లైసెన్సులు రద్దు

అధికారుల విచార‌ణ‌లో నిబంధ‌న‌లు ఉల్లంఘించిన 9 సంస్థ‌ల ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్సుల‌ను ర‌ద్దు చేశారు. వీటిలో హరిప్రియ ప్రొడక్ట్స్, దయానంద్ ఐస్‌క్రీమ్స్, రాజు ఘీ స్వీట్ హౌస్, శ్రీ కృష్ణ ఆయిల్ మిల్స్, రమేష్ ఇండస్ట్రీస్, జియాన్ ఫుడ్ ప్రొడక్ట్స్, శ్రీ ఎస్ఎంపీ డైరీ, కపిల్ ఫుడ్స్, కృపా బేకరీ ప్రొడక్ట్స్ వంటి సంస్థ‌లు ఉన్నాయి. ఈ సంస్థ‌ల‌కు చెందిన యూనిట్ల‌లో తక్షణమే ఆహార త‌యారీ నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ త‌నిఖీల్లో అధికారులు 5,555 కేజీల ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5,89,550 ఉంటుంద‌ని తెలిపారు. మ‌రికొన్ని ఆహార ప‌దార్థాల క‌ల్తీపై అనుమానం రావ‌డంతో అధికారులు 21 శాంపిళ్ల‌ను సేక‌రించి ప‌రీక్ష‌ల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. మ‌రో 9 యూనిట్ల‌కు నోటీసులు జారీ చేశారు. గంగా ఫుడ్ టెక్ అండ్‌ స్పైసెస్ ప్రైవేట్ లిమిటెడ్, జీపీఆర్ ఫుడ్స్, హెల్తీ హార్ట్ ఫుడ్స్, వర్ష స్పైసెస్, కరాణి స్పైసెస్, మిఠాయివాలా, బెల్ బ్రాండ్, స్వాగత్ స్వీట్స్, మార్లుస్ ఫుడ్ అండ్‌ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆహార నాణ్యతపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్క‌డైనా ఆహార భద్రతా ఉల్లంఘనలు త‌మ దృష్టికి వ‌స్తే ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>