కలం, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది ప్రీ రిలీజ్ వేడుకకు సర్వం సిద్ధమైంది. మొదట విజయనగరంలో జరగాల్సి ఉన్న ఈ వేడుకను ఇప్పుడు జూన్ 1న సోమవారం విజయవాడ (Vijayawada)లోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni) ప్రత్యేక చొరవతో ఈ ఈవెంట్ ఇక్కడికి మారడం గమనార్హం. జూన్ 4న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ మెగా వేడుకకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో అటు మెగా అభిమానులు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఈ ఈవెంట్ బాధ్యతలన్నీ కేశినేని చిన్న పర్యవేక్షిస్తుండటంతో పాస్‌ల పంపిణీ విషయంలో కొంత చర్చ నడుస్తోంది. వీవీఐపీ, వీఐపీ పాస్‌ల వ్యవహారం ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుండటంతో తమ కోటా పాస్‌ల కోసం కొందరు మెగా ఫ్యాన్స్ ఆయనను సంప్రదించాల్సి వస్తోంది. ఈ క్రమంలో పాస్‌ల కేటాయింపుల్లో కాస్త బేధాభిప్రాయాలు ఎదురవుతున్నట్లు సమాచారం. ఏదేమైనా మెగా హీరో సినిమా కోసం చిన్న దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు చాలా రోజుల తర్వాత మెగా హీరోలు ఒకే వేదికపై కనిపిస్తారని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

