Mobile Popup Ad
Mobile Popup Ad

‘హైస్పీడ్’ అలైన్‌మెంట్ మార్పు.. నల్లగొండకు ‘బుల్లెట్’ వరం

కలం, నల్లగొండ బ్యూరో: ఇప్పటివరకు కేవలం వ్యవసాయాధారిత ప్రాంతంగా నాగార్జునసాగర్ పర్యాటక రంగానికే పరిమితమైన ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లా సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి దూసుకెళ్లేందుకు బుల్లెట్ వేగంతో అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ – చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ అలైన్‌మెంట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఊహించని మార్పులు నల్లగొండ జిల్లా భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోతున్నాయి. తెలంగాణ పరిధిలో ప్రతిపాదించిన నాలుగు స్టేషన్లలో ఏకంగా మూడు స్టేషన్లను సొంతం చేసుకుని జిల్లా త్రిబుల్ ధమాకాతో పారిశ్రామిక, లాజిస్టిక్ హబ్‌గా అవతరించబోతుంటే.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే పాత రూట్‌లోని సూర్యాపేట, ఖమ్మం జిల్లాలు మాత్రం ఈ భారీ ప్రాజెక్టు చేజారడంతో తీవ్ర నిరాశ, నిరసన స్వరాలతో కొట్టుమిట్టాడుతున్నాయి.

మారనున్న నల్లగొండ జిల్లా ముఖచిత్రం..

గతంలో ప్రతిపాదించిన రూట్ ప్రకారం తెలంగాణలో బుల్లెట్ రైలు 236 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంది. కానీ, తాజా మార్పుల ప్రకారం ఈ దూరం కేవలం 123 కిలోమీటర్లకు పరిమితమైంది. ఈ కొత్త రూట్ పూర్తిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వెనుకబడిన, సాగర్ రోడ్ బెల్ట్ ప్రాంతాల గుండా వెళ్లనుంది. తెలంగాణ పరిధిలో నిర్మించే నాలుగు స్టేషన్లలో.. ఏకంగా మూడు స్టేషన్లు (మాల్/డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి) నల్లగొండ జిల్లాలోనే రావడం విశేషం. ఇదిలాఉంటే.. చింతపల్లి మండలం మాల్ సమీపంలో ప్రతిపాదించిన డ్రైపోర్ట్‌కు బుల్లెట్ రైలు అనుసంధానత లభించనుంది. ఇది నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే అతిపెద్ద సరకు రవాణా, పారిశ్రామిక హబ్‌గా మార్చబోతోంది. స్టేషన్లు వచ్చే మాల్, హాలియా, వాడపల్లితో పాటు రూట్ వెళ్లే మిర్యాలగూడ, దామరచర్ల, త్రిపురారం పరిసరాల్లో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు రానున్నాయి. స్థానిక రైతులకు, ఇన్వెస్టర్లకు ఇది భారీ ఆర్థిక లబ్ధి చేకూర్చనుంది. ఇక హాలియా స్టేషన్ నాగార్జునసాగర్‌కు అతి సమీపంలో ఉండటంతో, అంతర్జాతీయ పర్యాటకులు హైదరాబాద్ లేదా చెన్నై నుంచి కేవలం అరగంట వ్యవధిలో సాగర్ చేరుకోవచ్చు. దీనివల్ల స్థానిక హోటల్, సేవా రంగాలు ఊపందుకుని యువతకు ఉపాధి లభిస్తుంది.

పాత రూట్ జిల్లాల్లో నిరాశ.. ప్రజల్లో ఆగ్రహం..

ఒకవైపు నల్లగొండ సంబరాల్లో మునిగిపోతుంటే, మరోవైపు పాత రూట్ పరిధిలోని బాటసింగారం, చౌటుప్పల్, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం ప్రాంతాల ప్రజలు, వ్యాపార వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఈ నగరాలు ఇప్పటికే పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా వేగంగా ఎదుగుతున్నాయి. బుల్లెట్ రైలు కూడా వస్తే ఈ ప్రాంతాలు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటాయని భావించారు. అయితే ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ రంగాలు ఇక్కడికి వస్తాయని ఆశించిన స్థానికులకు ఈ నిర్ణయం గొడ్డలిపెట్టులా మారింది. మొదటి రూట్ ప్రతిపాదన రాగానే నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం బైపాస్ పరిసరాల్లో కోట్లాది రూపాయల పెట్టుబడులతో భూములు కొనుగోలు చేసిన వ్యాపారులు, సాధారణ ప్రజలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. జనాభా సాంద్రత, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కారిడార్‌ను వదిలేసి, తక్కువ జనాభా ఉన్న రూట్‌కు మార్చడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే విమర్శలు క్షేత్రస్థాయిలో గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ, ప్రభుత్వ కోణం వేరేలా ఉంది.

కొత్త రూట్ వల్ల దూరం సగానికి తగ్గడం ద్వారా వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుంది. అలాగే సూర్యాపేట, ఖమ్మం రూట్లలో భూముల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో భూసేకరణ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. కొత్త రూట్‌లో భూసేకరణ ఖర్చు తక్కువ, ఇబ్బందులు తక్కువ. దీనితో పాటు వెనుకబడిన ప్రాంతాలను పారిశ్రామికంగా ముందుకు తీసుకురావాలనే అభివృద్ధి వికేంద్రీకరణ వ్యూహం కూడా ఇందులో కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ, హైదరాబాద్ – చెన్నై హైస్పీడ్ కారిడార్ అలైన్‌మెంట్ మార్పు అనేది నల్లగొండ జిల్లా పారిశ్రామిక భవిష్యత్తుకు సరికొత్త బంగారు బాటలు వేయబోతోంది. కానీ, అభివృద్ధి చెందిన ప్రాంతాలను మరింత వేగంగా పరిగెత్తించే అవకాశాన్ని సూర్యాపేట, ఖమ్మం జిల్లాలు కోల్పోవడం గమనార్హం. ఒక ప్రాంతానికి లాభం, మరో ప్రాంతానికి నష్టం చేకూర్చిన ఈ ‘బుల్లెట్’ నిర్ణయం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ, సామాజిక పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>