Mobile Popup Ad
Mobile Popup Ad

7న విజయ్ ప్రమాణ స్వీకారం? రేపు గవర్నర్‌తో భేటీ

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రిగా సినీ నటుడు విజయ్ (Vijay)  గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు కొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు విజయ్ పార్టీ నాయకులు తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనంత మెజారిటీ లేకపోయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించనున్నారు. గవర్నర్‌తో విజయ్ బుధవారం లోక్‌భవన్‌కు వెళ్ళి సమావేశం కానున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ విజయ్ పార్టీ తరఫున 108 మంది మాత్రమే గెలిచారు. ఇంకా పది మంది మద్దతు అవసరం. వీరిని సమకూర్చుకోడానికి గవర్నర్ కొన్ని రోజులు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అప్పటికల్లా ఇతర పార్టీల నుంచి కొందరు ఎమ్మెల్యేలు విజయ్ పార్టీలో చేరే అవకాశమున్నది. లేదా బయట నుంచి మద్దతు ఇచ్చే అవకాశమున్నది. ఇప్పటికే కాంగ్రెస్, పాట్టాలి మక్కల్ కట్చి, విడుదలై చిరుత్తైగళ్, సీపీఐ, సీపీఎం, డీఎండీకే, ముస్లిం లీగ్ తదితర పార్టీలు మద్దతు ఇవ్వొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీవీకే తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా మహాబలిపురంలోని ప్రైవేటు రిసార్టుకు తరలివెళ్ళారు. ఇప్పటికే టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్‌ను ఎన్నుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. టీవీకే అధినేత విజయ్, తన పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసిన అనంతరం ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరం :

ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంపై చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీ, సాధారణ పరిపాలన శాఖ సెక్రటరీ, డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్ తదితరులు సమావేశమయ్యారు. వారి ఆదేశాలు, ప్లానింగ్ ప్రకారం నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని పార్టీల ప్రతినిధులతో పాటు పలువురు సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానాలు ఇవ్వాలనే ప్రాథమిక చర్చ జరిగింది. గవర్నర్‌తో విజయ్ సమావేశం తర్వాత నిర్దిష్టంగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరగనున్నది, ఎక్కడ ఉంటుంది, టైమ్ కూడా ఫిక్స్ అయ్యే అవకాశమున్నది. ఆలస్యం చేయడం ద్వారా అనర్ధాలు కూడా జరగొచ్చన్న ఉద్దేశంతో వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను కంప్లీట్ చేయాలన్నది విజయ్ ఆలోచన.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>