కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించతలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ కేవలం అవినీతి కోసమేనని ఆయన విమర్శించారు. వాషింగ్టన్ డి.సి., న్యూయార్క్లలో అనేకమంది బిలియనీర్లు, అంతర్జాతీయ నేతలతో తాను విజయవంతంగా గ్లోబల్ సమ్మిట్లు నిర్వహించానని, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిని కూడా తాను ముందే ఊహించానని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, సల్మాన్ ఖుర్షీద్, మల్లు రవితో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ ప్రక్రియ వేగవంతం కావాలని, కేసుల నుంచి ఎవరినీ తప్పించకూడదని పేర్కొన్నారు. మరోవైపు మహబూబ్నగర్లో విచారణ పర్యటన సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుదర్శన్ రెడ్డి పరారయ్యారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలన, క్యాష్ ఫర్ ఓట్ వ్యవహారం, ఇతర అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ అవినీతిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రాష్ట్ర చీఫ్ జస్టిస్, లా మినిస్టర్లకు వీడియో ఫిర్యాదులు పంపినట్లు వెల్లడించారు. అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు విద్యార్థులు, నిరుద్యోగ యువత తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన ఆధారాలతో కూడిన వీడియోలను ప్రతిరోజూ వరుసగా విడుదల చేస్తానని హెచ్చరించారు.

