తమిళనాడు సీఎం విజయ్ వివాదాస్పద నిర్ణయం !

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. విజయ్.. తన జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌కు (Radhan Pandit Vettrivel) కీలక పదవి కట్టబెట్టారు. ముఖ్యమంత్రికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ) పదవి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. విజయ్ ఘన విజయం సాధిస్తారని ముందుగానే జోస్యం చెప్పిన జ్యోతిష్యుడు వెట్రివేల్ కావడం గమనార్హం. జ్యోతిష్యుడిగా, టీవీకే అధికార ప్రతినిధిగా పేరుగాంచిన వెట్రివేల్.. ఎన్నికల ప్రచార సమయంలో పార్టీ నాయకత్వానికి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. మే 4న ఓట్ల లెక్కింపు సమయంలో టీవీకే అనూహ్య ఆధిక్యం సాధించగా.. విజయ్ నివాసానికి తొలిగా వెళ్లిన వ్యక్తి కూడా ఆయనే అని ప్రచారం జరిగింది.

డీఎంకే నేతల అభ్యంతరం

ఈ నియామకంపై ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా మూఢ నమ్మకాలపై కఠిన వైఖరి తీసుకునే డీఎంకే నేతలు ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై శశికాంత్ సెంథిల్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందిస్తూ.. “ఒక జ్యోతిష్కుడికి ఓఎస్‌డీ పదవి ఎందుకు అవసరం? ఎవరైనా చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు.

ఎవరీ వెట్రివేల్‌

దక్షిణ భారత రాజకీయాల్లో జ్యోతిష్కులు, రాజకీయ నేతల మధ్య సన్నిహిత సంబంధాలు కొత్తేమీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వెట్రివేల్‌కు (Radhan Pandit Vettrivel) మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సహా పలువురు ప్రముఖులు క్లయింట్లుగా ఉన్నారు. ఆమె హయాంలో కీలక రాజకీయ నిర్ణయాలు కూడా ఆయన సలహాలతోనే తీసుకున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకు వెళ్లరని చేసిన అంచనా తప్పిపోవడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని చెబుతారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 234 స్థానాల్లో 108 సీట్లు గెలుచుకుంది. అయితే పూర్తి మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

Read Also: రేపే విజయ్ బలనిరూపణ.. ఏం జరగబోతున్నది?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>