టీ20 టీమ్ కొనుగోలు చేసిన ద్రవిడ్.. కెప్టెన్‌గా అశ్విన్!

కలం, వెబ్‌డెస్క్: క్రికెట్ ప్రపంచంలో ‘మిస్టర్ డిపెండబుల్’గా పేరున్న రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ఇప్పుడు సరికొత్త అవతారంలో మన ముందుకు వస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న యూరోపియన్ టీ20 ప్రిమియర్ లీగ్ (ETPL)లో డబ్లిన్ ఫ్రాంచైజీకి ద్రవిడ్ యజమానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని లీగ్ సహ యజమాని అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) అధికారికంగా ప్రకటించారు. జట్టు యాజమాన్యంలో తనకు రాహుల్ ద్రవిడ్ భాగస్వామి కావడంపై అభిషేక్ స్పందిస్తూ.. ఇది చాలా మంచి పరిణామమన్నారు. ద్రవిడ్ వంటి వ్యక్తులు లీగ్‌లో ఉండటం వల్ల దానికి గొప్ప విశ్వసనీయత వస్తుందని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. ఇది కేవలం సెలబ్రిటీల కోసం కాకుండా, యూరోప్‌లో క్రికెట్ అభివృద్ధికి, స్థానిక యువ ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ఒక వేదికగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే ఈ లీగ్‌ ద్వారా యూరోప్‌లో క్షేత్రస్థాయి నుంచి క్రికెట్‌ను బలోపేతం చేసే అవకాశం రావడం వల్లే తాను ఈ ప్రాజెక్ట్‌లో చేరినట్లు ద్రవిడ్ (Rahul Dravid) తెలిపారు. రాబోయే తరానికి మార్గదర్శకంగా ఉండటమే తన లక్ష్యమని ఆయన వివరించారు. అయితే ఈ లీగ్‌లో రాహుల్ ద్రవిడ్ యజమానిగా ఉన్న డబ్లిన్ ఫ్రాంచైజీ టీమ్ కెప్టెన్‌గా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బాధ్యతలు చేపట్టనున్నారు. మెంటార్‌గా కూడా అశ్విన్ వ్యవహరించనున్నారు. ఇది ఈ లీగ్‌లోనే అతిపెద్ద ఒప్పందంగా నిలిచింది. క్రికెట్ ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ బోర్డుల భాగస్వామ్యంతో ఈ లీగ్ జరుగుతుంది. డబ్లిన్, బెల్ఫాస్ట్, ఎడిన్‌బర్గ్, గ్లాస్గో, రోటర్‌డ్యామ్, ఆమ్‌స్టర్‌డ్యామ్ నగరాల నుంచి మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి.

ఈ టోర్నీ 2026 ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 20 వరకు జరుగుతుంది. ఐసీసీ కేటాయించిన ప్రత్యేక విండోలో మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో ఇప్పటికే స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు భాగస్వాములయ్యారు. కబడ్డీలో సక్సెస్ సాధించిన అభిషేక్ బచ్చన్, ఇప్పుడు అదే ఫార్ములాతో యూరోపియన్ క్రికెట్‌లో అడుగుపెడుతున్నారు. ఈ కొత్త ప్రయాణం యూరోప్‌లో క్రికెట్ భవిష్యత్తును ఎలా మారుస్తుందో వేచి చూడాలి.

Read Also: విరాట్ కోహ్లీపై సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>