కలం, వరంగల్ బ్యూరో: ప్రభుత్వాలు మారుతున్నా.. పాలకులు మారుతున్నా ప్రభుత్వాస్పత్రుల తీరు మారడం లేదు. నేటికీ వైద్యులు, మందుల కొరత పట్టిపీడిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం (Warangal MGM) దవాఖానలో పేదోడికి నాణ్యమైన వైద్యం అందడం లేదు. పేదోడు వైద్యం కోసం వెళ్తే సమస్యలు ఎదురవుతున్నాయి. ఆస్పత్రిలో అడుగు పెట్టిన దగ్గర నుంచి అనేక అవమానాలు, ఇబ్బందులు, ఛీదరింపులు ఎదుర్కొంటున్నాడు. అక్కడ అన్ని ఉచితమే చెప్తారు, కానీ డబ్బులు ఇవ్వాల్సిందే. లేకుంటే వైద్యం అందదు. కానీ అక్కడి డాక్టర్లు దాదాపుగా బయట ప్రైవేట్ ఆస్పత్రులు నడుపుతున్నారు. మొక్కుబడిగా డ్యూటీ చేశామా? అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అక్రమార్కుల చిట్ట సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
టైమ్‌కు రారు.. వైద్యం చేయరు
ఎంజీఎంలో ఉదయం 9 గంటలకు ఓపీ సేవలు ప్రారంభం కావాల్సి ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు ఉదయం 8 గంటలకే ఎంజీఎం చేరుకుంటారు. అయితే 11 గంటలకుగానీ డాక్టర్లు రావడం లేదని చాలా మంది రోగులు చెబుతున్నారు. దీంతో వేలాది మంది గంటల కొద్దీ క్యూలో నిలబడాల్సి వస్తోంది.
వైద్య సేవలు ఆలస్యం
అత్యవసర విభాగంలో కూడా స్ట్రెచర్, స్టాఫ్ లేకపోవడంతో గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వస్తోంది. కొన్నిసార్లు సీరియస్ కేసుల్లోనూ వెంటనే స్పందించడం లేదని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు ఆస్పత్రిలో సెక్యూరిటీ వాళ్ళ వసూళ్ల దందా అంతా ఇంతా కాదు. బెడ్ ఇప్పిస్తాం, త్వరగా అడ్మిషన్ చేయిస్తామని సెక్యూరిటీ సిబ్బందే రూ.200-500 వరకు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైనప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
మందులకూ కొరతే
ఆస్పత్రిలో ఉచితంగా ఇవ్వాల్సిన మందులు స్టాక్ లేదని చెప్పి బయట ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనాలని చెప్తున్నట్లు తెలుస్తోంది. రోగులకు (Patients) అయోమయానికి గురిచేసి ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేసేలా మాయచేస్తున్నారు. ఫలితంగా ఆయా షాపుల నుంచి కమీషన్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంజీఎంకు వచ్చే రోగులు వివిధ పరీక్షల కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. బ్లడ్ టెస్ట్, స్కానింగ్ రిపోర్ట్స్ కోసం 2-3 రోజులు వేచి చూడాల్సి వస్తోంది. కొన్ని టెస్టులకు బయట ప్రైవేట్ ల్యాబ్‌లకు రిఫర్ చేస్తున్నట్లు సమాచారం.
విజిలెన్స్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు
ఎంజీఎంలో పలు విభాగాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. మందుల స్టాక్ రిజిస్టర్, పేషెంట్ల అడ్మిషన్ రికార్డులు, బిల్లింగ్ సిస్టమ్‌ను తనిఖీ చేశారు. అంతేగాకుండా వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికలు రాకపోకల వివరాలు సేకరించినట్లు తెలిసింది. కొన్ని అనధికార లావాదేవీలు, స్టాక్ మిస్మాచ్‌లు బయటపడ్డట్టు సమాచారం. గతంలో ఎంజీఎంలో జరిగిన ఆక్సిజన్ సిలిండర్ల కుంభకోణంలో సుమారు 20 మందికిపైగా దోషులుగా తేలారు. మళ్ళీ చాలాకాలం తర్వాత ఎంజీఎంలో విజిలెన్స్ శాఖ తనిఖీలతో అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు.

