కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా జమ్మికుంట (Jammikunta) పట్టణంలోని సప్తగిరి రైస్ మిల్లులో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి (ఎస్పీ) బస్వారెడ్డి నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. మిల్లులో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) ధాన్యం నిల్వలు, సంబంధిత రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పౌరసరఫరాల శాఖ నుంచి గత కొన్ని సంవత్సరాలుగా మిల్లుకు కేటాయించిన ధాన్యం, దానికి అనుగుణంగా ప్రభుత్వం అందుకోవాల్సిన సీఎంఆర్ బియ్యం వివరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మిల్లుకు సంబంధించిన పాత, కొత్త రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. ధాన్యం కేటాయింపులు, నిల్వలు, ప్రభుత్వానికి తిరిగి అప్పగించిన బియ్యం వివరాల మధ్య ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా అనే అంశంపై దృష్టి సారించారు. రికార్డుల పరిశీలనలో మిల్లులోని ధాన్యం నిల్వలకు, ప్రభుత్వ లెక్కలకు మధ్య తేడాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. కేటాయించిన ధాన్యం, అందుబాటులో ఉన్న నిల్వల మధ్య వ్యత్యాసాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. తనిఖీల్లో రీజనల్ విజిలెన్స్ అధికారి బస్వారెడ్డితో పాటు కరీంనగర్ విజిలెన్స్ డీఎస్పీ సీతారెడ్డి, విజిలెన్స్ సీఐలు అనిల్, ప్రశాంత్‌రావు, రవీందర్, జమ్మికుంట తహసీల్దార్ దినేష్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ధాన్యం నిల్వల్లో గుర్తించిన తేడాలపై అధికారులు తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

