కలం, వెబ్ డెస్క్: మహిళలు విద్యావంతులైనప్పుడే వికసిత భారత నిర్మాణం సాధ్యమౌతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అభిప్రాయపడ్డారు. సంప్రదాయాలు మంచివే కానీ.. అవి మహిళా సాధికారతకు అడ్డంకులు కారాదని అన్నారు. ఆడపిల్లలు చదువుకోవడం అంటే ఒక హక్కు మాత్రమే కాదని.. అది సమాజ అభివృద్ధి దిశగా వేసే మేలి పునాది అని అభివర్ణించారు. మహిళలను బలహీన పరిచే కొన్ని సాంఘిక అంశాల విషయంలో పునరాలోచించాలని సూచించారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రంతోపాటు స్వేచ్ఛ, సాంఘిక, ఆర్థిక సుసంపన్నత, రాజకీయ అధికారాల్లో భాగస్వామ్యం రావాలని ఆకాంక్షించారు.
చిత్తూరులోని ఎన్‌పీ సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల (NP Savithramma Womens College)లో గురువారం నిర్వహింన స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల ప్రాంగణంలో నిర్మించిన నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) మాట్లాడుతూ.. నూతన భవనాలను ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ భవనాల నిర్మాణానికి విరాళాలిచ్చిన దాతలకు, వారికి సహకరించిన వారందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేశారు. దాదాపు కళాశాల స్థాపించిన 45 ఏళ్ళ తర్వాత కూడా ఎన్ పీ సావిత్రమ్మ కుటుంబ సభ్యులు ఈ కళాశాలకు తమ సహకారాన్ని అందిస్తుండటం ఆమె పట్ల వారికున్న అభిమానానికి, బాధ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి కళాశాలల వెనుక ప్రధాన ఉద్దేశం మహిళా విద్య అని.. తద్వారా మహిళా సాధికారత, దాని ద్వారా దేశాభివృద్ధి జరుగుతుందని అభిలషించారు. బాలికల విద్యకు, మహిళా సాధికారతకు కట్టుబడి కృషి చేయడమే సావిత్రమ్మ లాంటి మహిళామణులకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
Read Also: ఇది నా జీవితంలో సంతోషకరమైన రోజు : జీవన్ రెడ్డి
Follow Us On: Sharechat

