Mobile Popup Ad
Mobile Popup Ad

వారికే పదవులు ఇస్తాం: విప్ వేముల వీరేశం క్లారిటీ

కలం, నకిరేకల్‌: పార్టీకి కట్టుబడి, ప్రజలకు సేవ చేసే వారికే అవకాశాలు ఇస్తామని ప్రభుత్వ విప్ వేముల వీరేశం (Vemula Veeresham) స్పష్టం చేశారు. నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థ నాయకత్వంలో, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని ప్రకటించారు. త్వరలోనే జిల్లా, మండల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తామని, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం

బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వేముల వీరేశం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, కానీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని, రానున్న ఏ ఎన్నికల్లోనైనా నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2029లో రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయడమే మనందరి ప్రధాన లక్ష్యం కావాలని వేముల  (Vemula Veeresham) పిలుపునిచ్చారు.

సంక్షేమ పథకాలు ఇంటింటికి తీసుకెళ్లండి: మువ్వా విజయ్ బాబు

రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో వీరేశాన్ని భారీ మెజారిటీతో గెలిపించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉండే వీరేశం నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చెవుగోని రజితశ్రీనివాస్, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతరమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్లు గుత్తా మంజులమాధవరెడ్డి, నర్రా వినోదమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>