బీజేపీ రాజకీయ కుట్రను రాహుల్, రేవంత్ ఛేదించారు -వేముల

కలం, వెబ్ డెస్క్ : డీలిమిటేషన్ ప్రక్రియతో చిన్న రాష్ట్రాలను, దక్షిణాది రాష్ట్రాలను బానిసలుగా చేసుకోవాలన్న బీజేపీ కుట్రను రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి దీటుగా ఎదుర్కొన్నారని, పెను ప్రమాదాన్ని నిలువరించారని విప్ వేముల వీరేశం (Vemula Veeresham) అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసిన బీజేపీ కుట్రలను ఛేదించడంలో, నిలువరించడంలో ‘ఇండియా’ టీమ్ గొప్ప విజయాన్ని సాధించిందన్నారు. బీజేపీ కుటిల రాజకీయాలను ‘ఇండియా’ భాగస్వామ్య పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి నిలువరించడంలో వారిద్దరి నాయకత్వ పటిమ మరోసారి స్పష్టమైందన్నారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతోనే బీజేపీ డీలిమిటేషన్ కుట్రలు పటాపంచలయ్యాయన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియను మహిళా రిజర్వేషన్‌ (Women Reservation Bill)తో లింకు చేయవద్దంటూ మొదటి నుంచీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేశారు.

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం :

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు, చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతున్నదని అనేక సందర్భాల్లో చెప్పడమే కాకుండ వాటిని ఏకం చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి సక్సెస్ అయ్యారని విప్ వేముల వీరేశం గుర్తుచేశారు. నష్టపోయే రాష్ట్రాలను ఏకం చేసి డీలిమిటేన్ కుట్రలను అడ్డుకుంటామని స్పష్టంగా చెప్పారని, ఆ ప్రకారమే ఒక బలమైన నాయకత్వం ఇచ్చే కేంద్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. సీఎం వాదనను, కమిట్‌మెంట్‌ను నమ్మిన, విశ్వసించిన పార్టీలన్నీ రాహుల్‌గాంధీ నాయకత్వంలో విజయం సాధించాయన్నారు. బీజేపీ ద్వంద్వ నీతిని, వైఖరిని ఎండగట్టి తూర్పారబట్టారని గుర్తుచేశారు. మోడీ తెస్తున్న దుర్మార్గమైన ఆలోచన, రాజకీయ కుట్ర ఈ దేశం ఉత్తర, దక్షిణ భాగాలుగా విడిపోయే ప్రమాదం ఉన్నదని, ఉత్తరాది రాష్ట్రాల చేతిలో దక్షిణాది బానిసలుగా బతికే కుట్రను నిలువరించారని వ్యాఖ్యానించారు.

రాహుల్ వ్యూహంతో తలవంచిన మోడీ :

మహిళా రిజర్వేషన్ ముసుగులో ప్రధాని మోడీ డీలిమిటేషన్ (Delimitation) కుట్రను వ్యూహ రచన చేశారని, కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌గాంధీ ఈ దేశ ప్రజల పక్షాన తనదైన శైలిలో ఎత్తుగడలు వేశారని, చివరకు మోడీ తల వంచక తప్పలేదని విప్ వేముల వీరేశం గుర్తుచేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక విజన్ ఉన్న నాయకుడిగా శాస్త్రీయ దృక్పథంతో నీతి, నిజాయితీ, ధర్మం, ప్రజల పక్షాన నిలిచే నేతగా రేవంత్‌రెడ్డిని సైతం పలు పార్టీలు గుర్తించాయన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 2023 నాటి బిల్లును అమలు చేయడంలో ఉన్న ఇబ్బందులేంటని ప్రశ్నించారు. డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెడుతున్నారని నిలదీశారు. పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ లేదని తెలిసినా, పాస్ కాదని అర్థమైనా, దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిసి కూడా ఎందుకు ఈ బిల్లును పెట్టారని ప్రశ్నించారు.

తమిళనాడు, బెంగాల్ ఎన్నికల కోసమే.. :

తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, రాజకీయ ప్రయోజనం కోసమే ఈ బిల్లును బీజేపీ ముందుకు తీసుకొచ్చి విపక్షాలను దోషిగా పెట్టాలనే కుట్ర చేస్తున్నదని విప్ వేముల వీరేశం (Vemula Veeresham) ఆరోపించారు. మహిళలను గౌరవించాలన్న చిత్తశుద్ధి బీజేపీకి లేదని, ప్రజలు కూడా దాని నిజాయితీని శంకిస్తున్నారని అన్నారు. బీజేపీ ఏర్పడిన 46 ఏండ్లలో ఏనాడూ మహిళకు నాయకత్వ బాధ్యతలు ఇవ్వలేదని, పార్లమెంటరీ బోర్డులో ఒకే ఒక్క మహిళ ఉన్నదని గుర్తుచేశారు. ఆర్ఎస్ఎస్‌లో నిర్ణయాత్మక పొజిషన్‌లో ఒక్క మహిళ కూడా లేరని అన్నారు. మహిళలను నాయకత్వ స్థానాల్లోకి తేవాలనే ఆలోచన బీజేపీకి లేదని, ఆ కమిట్‌మెంట్ కూడా బీజేపీకి లేదన్నారు. మనుధర్మ శాస్త్రాన్ని, సిద్ధాంతాన్ని నమ్మిన బీజేపీ మహిళలను వంటింటి కుందేల్లుగా, ఓటింగ్ యంత్రంగానే చూస్తున్నదన్నారు. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా మహిళలను నమ్మరని అన్నారు.

మోడీ మాటల్లోనే వాస్తవం తెలిసిపోయింది :

ఈ బిల్లు ఆమోదం పొందకపోయినా నష్టం లేదంటూ స్వయంగా ప్రధాని మోడీ అన్నారని, ఈ మాటలతో ఆ పార్టీ రాజకీయ ప్రయోజనం ఎలా ఉన్నదో అర్థమవుతున్నదని విప్ వేముల వీరేశం అన్నారు. రాహుల్‌గాంధీ, రేవంత్ ఎత్తుగడలతో గెలవలేమని అర్థమైన తర్వాత తెలంగాణపై రాజకీయ విషాన్ని చిమ్ముతూ తప్పుడు ప్రచారానికి బీజేపీ ఒడిగట్టిందన్నారు. నిజానికి విపక్షాలు అడ్డుకున్నది మహిళా రిజర్వేషన్ బిల్లును కాదని, దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పును అని అన్నారు. ఇండియా కూటమి ఈ చొరవ తీసుకుని ఉండకపోతే దక్షిణాది రాష్ట్రాలు బానిసత్వంలోకి వెళ్లిపోయేవన్నారు. ఈ దేశానికి రోల్ మోడల్‌గా, దిక్సూచిగా, విజన్ ఉన్న నేతగా రేవంత్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారని అన్నారు. బీజేపీకి ఇప్పటి నుంచే పతనం మొదలైందన్నారు. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్‌గా లేకుండా చేస్తామని రేవంత్‌రెడ్డి 2024లోనే చాలా స్పష్టంగా చెప్పారని, చేసి చూపించారని గుర్తుచేశారు. ఇప్పుడు డీలిమిటేషన్‌కు దక్షిణాది రాష్ట్రాల నుంచే బ్రేక్ వేయిస్తామని చెప్పి మరీ ఆ పని చేసి చూపించారని అన్నారు. బిల్లులోని లోపాలను, బీజేపీ కుట్రలను పార్టీలకు విడమర్చి చెప్పి అర్థం చేయించి అడ్డుకున్నారని తెలిపారు.

బీజేపీ స్టేట్ చీఫ్‌ వాదనలో పస లేదు :

బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావుకు మహిళా రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధి, నిజాయితీ లేదని వేముల వీరేశం అన్నారు. నిజంగా మహిళలకు రాజకీయ సాధికారత కల్పించాలన్న కమిట్‌మెంట్ బీజేపీకి ఉన్నట్లయితే 2023లోనే బిల్లు విధివిధానాలను నిర్ణయించాల్సి ఉన్నదన్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లోనే 543 స్థానాల్లో 33% వారికి దక్కి ఉండేవన్నారు. ఒక్క మహిళను ఆ పార్టీకి జాతీయ అధ్యక్షురాలిని చేసి ఉంటే సంతోషించేవాళ్ళమన్నారు. డీలిమిటేషన్‌తో లింకు పెట్టకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును పెడితే వెంటనే సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆమోదం తెలపుతామంటూ రాహుల్‌గాంధీ తన ప్రసంగంలోనూ చెప్పారని గుర్తుచేశారు. జనాభా ప్రాతిపదికతో రెండు మూడు రాష్ట్రాల్లో సీట్లు పెంచి ఇతర రాష్ట్రాలను బానిసలుగా మార్చుకోవాలని బీజేపీ చూస్తున్నదని ఆరోపించారు. బీజేపీ గతంలో గోద్రా అల్లర్లలో మహిళలను ఊచకోత కోయలేదా?.. మణిపూర్‌లో అల్లర్లలో బీజేపీ పాత్ర తెలియదా?.. పశ్చిమబెంగాల్‌లోని అనేక ఘటనలు మహిళల పట్ల, వారి మానప్రాణాల పట్ల బీజేపీ నైజం బహిర్గతం కాలేదా?.. అని గుర్తుచేశారు. మహిళలను ఓటు బ్యాంకుగా వాడుకోవాలనే ఆలోచనే తప్ప వారిని ఉద్ధరించాలనే చిత్తశుద్ధి బీజేపీకి లేదన్నారు. బిల్లు వీగిపోయిన తర్వాత ఆ పార్టీ మీద మహిళలకు సింపతీ రాలేదన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>