చీరి చింతకు కడతారు.. కేటీఆర్, హరీశ్‌‌రావులపై వేముల వీరేశం ఫైర్

కలం, తెలంగాణ బ్యూరో : ఇంతకాలం అధికారం పోయిందనే ఆవేదన, ఇప్పుడు ఎండదెబ్బ కొట్టి కేటీఆర్, హరీశ్‌రావులకు సోయి తప్పిందని, ఫ్రస్ట్రేషన్‌లో ఏం మాట్లాడుతున్నారో కూడా వారికే తెలియడంలేదని విప్ వేముల వీరేశం (Vemula Veeresham) ఫైర్ అయ్యారు. బాగా సఫోకేషన్‌లో బావ, బామ్మర్దులిద్దరూ పోటీపడి మరీ హైలైట్ కావడానికి అబద్ధాలను అస్త్రంగా ఎంచుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో బుధవారం వేముల వీరేశం మాట్లాడుతూ, రైతుల్ని గందరగోళపర్చడానికి ఒకరు, ప్రజల మెదళ్ళను డైవర్ట్ చేసేలా మరొకరు రొటీన్ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఏదో ఒక అబద్ధాన్ని ప్రతీరోజూ జనంలోకి తీసుకెళ్ళడమే వారి డైలీ యాక్టివిటీ అయిందన్నారు. నీచమైన రాజకీయాలకు పాల్పడుతూ ప్రజలకు వారు మరింత దూరమవుతున్నారని, చీరి చింతకు కట్టే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.

ధాన్యం కొనుగోళ్ళు జరగకుంటే ఎమ్మెల్యేలుగా ఏం చేస్తున్నారు?

రాష్ట్రంలో ధాన్యం, మక్కలు, శెనగలు, సోయా, సన్ ఫ్లవర్ కొనుగోళ్లు జరగడంలేదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు పచ్చి అబద్ధాలతో లెటర్ రాశారని గుర్తుచేసిన విప్ వేముల వీరేశం (Vemula Veeresham).. ఇదే నిజమైతే ఒక ఎమ్మెల్యేగా సిద్దిపేట్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి సక్రమంగా జరిగేలా ఎందుకు చొరవ తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,300 కొనుగోలు కేంద్రాల్లో 7.70 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్రంలో 3.46 లక్షల టన్నుల మొక్కజొన్న, 30,220 టన్నుల శెనగలు, 3,492 టన్నుల సన్‌ఫ్లవర్ కొనుగోళ్ళు జరిగాయని, వ్యవసాయ శాఖ ద్వారా వివరాలు తెప్పించుకోవచ్చన్నారు. బాధ్యత కలిగిన ప్రధాన ప్రతిపక్షానికి ఉప నాయకుడిగా ఉన్న హరీశ్‌రావు పచ్చి అబద్ధాలతో రైతుల్ని గందరగోళంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలకు మసిబూసి అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ హయాంలో 6,676 మంది రైతుల సూసైడ్ :

బీఆర్ఎస్ కాలంలో రైతులకు అంతా మంచి జరిగినట్లు, ఇప్పుడు కాంగ్రెస్‌లో రైతులు ఇబ్బంది పడుతున్నట్లు హరీశ్‌రావు మాట్లాడుతున్నారని ప్రస్తావించిన విప్ వేముల వీరేశం.. తొమ్మిదిన్నరేండ్ల కాలంలో 6,676 మంది రైతులు రాష్ట్రంలో సూసైడ్ చేసుకున్నరని గుర్తుచేశారు. రైతుబంధును 2018లో ప్రవేశపెట్టిన తర్వాత రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయంటూ గొప్పలు చెప్పుకున్నా దాదాపు రెండున్నర వేల మంది సూసైడ్ చేసుకున్నారని సంవత్సరాలవారీగా లెక్కలు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రైస్ మిల్లర్లతో ఆ పార్టీ నేతలు కుమ్మక్కయ్యారని, నల్లగొండ జిల్లా మర్రిగూడలో క్వింటాల్‌కు 11 కిలోల చొప్పున తరుగు పేరుతో రైతులకు అన్యాయం చేసి దాదాపు 40 లక్షలను ఎగనామం పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో 2023 యాసంగి సీజన్‌లో 66 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోళ్ళలో తాలు, తరుగు పేరుతో టన్నుకు 80 కిలోల చొప్పున అక్రమాలు చేసి దాదాపు 5 లక్షల టన్నుల ధాన్యానికి డబ్బులే చెల్లించలేదన్నారు.

వరి వేస్తే ఉరి.. మక్కలు వేస్తే కొనబోం.. ఇదీ బీఆర్ఎస్ తీరు :

బీఆర్ఎస్ హయాంలో వరి వేస్తే ఉరి అంటూ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారని, మొక్కజొన్నలు పండించినా ప్రభుత్వం కొనేది లేదంటూ బెదిరించారని వేముల వీరేశం గుర్తుచేశారు. అన్నదాతల మృత్యుఘోష, యూరియా దొరకట్లేదు, రోజుకో రైతు బలి, చెప్పుకోలేని బాధ, కూలీలకు బేడీలు, రాళ్ళు రప్పలకు రైతుబంధులో 26 వేల కోట్లు వృథా, రైతులకు తప్పని కష్టాలు, సంచులు నింపుతూ తుదిశ్వాస, తమ్ముడా వెళ్ళిపోతున్నా అంటూ అన్న మృతి, ధాన్యం రాశిపైనే ఆగిన ఊపిరి.. ఇవన్నీ తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన రైతుల ఆత్మహత్యలు, రైతుల కడగండ్లు అని పత్రికల్లోని వార్తలను చూపించారు. ఇప్పుడు ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తూ ఉంటే జీర్ణించుకోలేక అబద్ధాలతో రైతుల్ని కన్‌ఫ్యూజ్ చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. వడ్లను కొన్న మూడు రోజుల్లోనే డబ్బుల్ని వారి ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేస్తున్నదని గుర్తుచేశారు.

పార్టీలో ఆధిపత్యం కోసం ఇద్దరూ డ్రామాలు :

ఒకరు ఫామ్ హౌజ్ నుంచి బైటకు రారు, మరొకరు హైదరాబాద్ విడిచి సిరిసిల్లకు పోరు, ఇంకొకరు దేశమంతా గాలి పర్యటనలు చేస్తున్నారని విప్ వేముల వీరేశం ఆరోపించారు. వారి మధ్య ఆధిపత్య పోరు కోసం ఒకరు ఉత్తరాలు రాస్తూ ఉంటే మరకొరు ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. నిత్యం పత్రికల్లో, మీడియాలో చెరో పక్క లైవ్‌లో ఉండేందుకు ఆడుతున్న డ్రామాలే ఇవి అని అన్నారు. వారిద్దరికీ ప్రజల పట్ల, రైతుల పట్ల నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదన్నారు. చివరకు ప్రజల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపిస్తే ఆ ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కట్టిస్తా అని నమ్మబలికి తొమ్మిదిన్నరేండ్లయినా పడావులో పెట్టిన కేసీఆర్‌కు ఇప్పుడు కృష్ణా జలాల గురించి, పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. కేటీఆర్ కూడా ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి గోబెల్స్ ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ హయాంలోని కార్పొరేషన్ అప్పులను, కాంట్రాక్టర్ల బిల్లుల పెండింగ్ పేమెంట్ల వివరాలను దాచిపెట్టడం ఆయన డబుల్ స్టాండర్డ్స్‌కు నిదర్శనమన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>