కలం, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర భద్రతా బలగాలు పోలింగ్ బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకున్నాయని ఆరోపించారు. ప్రజలు ప్రశాంతంగా ఓటు వేసే పరిస్థితి లేదని చెప్పారు. కేంద్రబలగాలు రాష్ట్రంలో అరాచకం సృష్టించాయని ఫైర్ అయ్యారు. చిన్నపిల్లలు, మహిళలు అనే తేడా లేకుండా అందరి మీద లాఠీ చార్జ్ చేశారని ఫైర్ అయ్యారు.
టీఎంసీ ఏజెంట్లే లక్ష్యం
తృణముల్ కాంగ్రెస్ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ తమ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. “ఏ పోలింగ్ బూత్ కూడా సురక్షితంగా లేదు. సీఆర్ పీఎఫ్ ఈ విధంగా హింసకు పాల్పడకూడదు. బూత్‌ల వద్ద రాష్ట్ర పోలీసులను నియమించలేదు. అన్ని బూత్‌లను కేంద్ర బలగాలే ఆక్రమించాయి. ఇదేనా వారి విధి?’ అంటూ ఆమె ప్రశ్నించారు. భవానీపూర్ నియోజకవర్గంలో ఓటు వేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
దక్షిణబెంగాల్‌లో ఘర్షణలు
దక్షిణ బెంగాల్‌లో పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. డైమండ్ హార్బర్‌లో కొన్ని బూత్‌ల వద్ద ఓటింగ్ నిలిపివేశారు. ఓటింగ్ యంత్రాలను తృణమూల్ కాంగ్రెస్ తారుమారు చేసిందని బీజేపీ ఆరోపించింది. అయితే, బెంగాల్‌లో ఓడిపోతున్నందుకే బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ప్రతిస్పందించింది.

