కలం, నాగర్ కర్నూల్: వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాల (Vattam Navodaya Admissions) కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ బి. పూర్ణిమ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2026–27 విద్యా సంవత్సరంలో ఈ మూడు జిల్లాల్లోని పాఠశాలల్లోనే 5వ తరగతి చదువుతూ ఉండటంతో పాటు, వారి తల్లిదండ్రుల నివాసం కూడా ఈ మూడు జిల్లాల్లో ఏదో ఒక జిల్లాలో ఉండాలన్నారు.అభ్యర్థులు ఇంటర్నెట్ సెంటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.ప్రధానోపాధ్యాయుడి సంతకంతో కూడిన ధ్రువీకరణ పత్రం, ఫొటోతో పాటు అవసరమైన వివరాలను జతచేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
దరఖాస్తుల సమర్పణకు జూలై 31 చివరి తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అర్హులైన విద్యార్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. 2025 మే 1 నుంచి 2017 జూలై 31 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని, ప్రవేశ పరీక్షను నవంబర్ 28న నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం www.navodaya.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
మెరిట్‌కే ప్రాధాన్యం
జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాలు పూర్తిగా ప్రతిభ ఆధారంగానే ఉంటాయని ప్రిన్సిపాల్ బి. పూర్ణిమ స్పష్టం చేశారు. డబ్బు లేదా సిఫారసులతో సీట్లు ఇప్పిస్తామని కొందరు తల్లిదండ్రులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని హెచ్చరించారు.

